Sriramsagar Project
Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు పెరుగుతున్న ఇన్​ఫ్లో..

అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయం నీటి మట్టం 40 టీఎంసీలు దాటడంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్​లోకి 7,479 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1078.10 (40.02 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.

మహారాష్ట్ర, స్థానికంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్​లోకి ఇన్​ఫ్లో వస్తోంది. సోమవారం ఉదయం 8,175 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా అనంతరం 7,479 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రాజెక్ట్​ నుంచి కాకతీయ కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Sriram Sagar | రైతుల హర్షం

శ్రీరాంసాగర్​(Sriram Sagar) ప్రాజెక్ట్​లో నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్​ కింద లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా ఉమ్మడి కరీంనగర్​, వరంగల్​ జిల్లాలకు సాగు నీరు అందిస్తారు. లక్ష్మి కాలువ ద్వారా నిజామాబాద్​ జిల్లాలోని పలు మండలాలకు నీరు అందుతోంది. అలాగే సరస్వతి కాలువ (Saraswathi Canal) ద్వారా నిర్మల్​ జిల్లాలోని రైతులకు సాగు నీరు విడుదల చేస్తారు. అంతేగాకుండా ఈ ప్రాజెక్ట్​ ఆధారంగా అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో నీరు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనంద పడుతున్నారు. నీటిమట్టం 50 టీఎంసీలు దాటిన తర్వాత కాల్వల ద్వారా ఆయకట్టుకు విడుదల చేసే అవకాశం ఉంది. ఏటా ఆగస్టు​, సెప్టెంబర్​లో నీటి విడుదలను అధికారులు ప్రారంభిస్తారు.