అక్షరటుడే, వెబ్డెస్క్: spicy food | చాలా మందికి భోజనంలో పచ్చిమిర్చి లేనిదే ముద్ద దిగదు. కొందరైతే కారాన్ని అమితంగా ఇష్టపడతారు. అయితే, మిరపకాయను కొరికినప్పుడు లేదా ఘాటైన ఆహారం తిన్నప్పుడు నోరంతా మండిపోవడం, ముక్కు నుంచి, కళ్ల నుంచి నీళ్లు కారడం మనం చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో మన శరీరం చేసే ‘హుస్.. హా’ అనే శబ్దాలు, వెంటనే నీళ్ల గ్లాసు కోసం వెతికే పరిస్థితి అందరికీ అనుభవమే. అసలు మిరపకాయ తింటే మన శరీరంలో ఇలాంటి మార్పులు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది.
spicy food | ప్రత్యేకమైన రసాయన సమ్మేళనం
అమెరికన్ కెమికల్ సొసైటీ పరిశోధనల ప్రకారం.. మిరపకాయల్లో ‘కెప్సైసిన్’ (Capsaicin) అనే ఒక ప్రత్యేకమైన రసాయన సమ్మేళనం ఉంటుంది. నిజానికి ఇది మిర్చి మొక్కకు ఒక రక్షణ కవచం లాంటిది. పక్షులు, జంతువులు లేదా మనుషులు ఆ మొక్కను తినకుండా ఉండటానికి, ప్రకృతి సిద్ధంగా ఈ ఘాటును మిరపకాయలకు ప్రసాదించింది. మనం మిర్చిని తిన్నప్పుడు, అందులోని కెప్సైసిన్ మన నోటిలోని కణజాలానికి తగిలి తీవ్రమైన మంటను కలిగిస్తుంది.
ఆ క్షణంలో మన మెదడు మన శరీరాన్ని ప్రమాదంలో ఉన్నట్లు భావించి, వెంటనే ‘డిఫెన్స్ మోడ్’ (రక్షణ చర్య) లోకి వెళ్తుంది. ఈ కెప్సైసిన్ అనే రసాయనం ఒక విదేశీ పదార్ధమని భావించి, దానిని సాధ్యమైనంత త్వరగా శరీరం నుంచి బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగానే మన కళ్లు, ముక్కులోని గ్రంధులు ఉత్తేజితమై నీటిని విడుదల చేస్తాయి. అంటే, శరీరంలోకి ప్రవేశించిన ఆ ఘాటైన రసాయనాన్ని కడిగివేయడానికి మన శరీరం చేసే సహజమైన ప్రయత్నమే ఈ కన్నీళ్లు, ముక్కు నుంచి నీరు రావడం.