అక్షరటుడే, కామారెడ్డి : Collector Kamareddy | వరద నష్టం అనంతరం కాలనీల్లో చేపడుతున్న పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ఈ మేరకు శనివారం జీఆర్ కాలనీలో ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు.
కాలనీవాసులకు వాటర్ బాటిళ్లు (Water Bottles) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న 48 ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 11,500 చొప్పున పరిహారం అందజేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వాగు ఉధృతికి ప్రధాన రహదారి తెగిపోవడంతో చేపడుతున్న పునరుద్ధరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సాయంత్రంలోపు ఒకవైపు రోడ్డు పనులు పూర్తిచేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
Collector Kamareddy | కదిలిస్తే కన్నీళ్లే..
పట్టణంలోని జీఆర్ కాలనీలో (GR Colony) వరద ధాటికి ఇళ్లన్నీ నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కట్టుబట్టలు మినహా కాలనీ వాసులకు ఏమీ మిగల్లేదు. వరద తగ్గాక ఇళ్లలో తమ సామాగ్రిని సర్దుకునే పనిలో బాధితులు నిమగ్నమయ్యారు. మరోవైపు కాలనీలో విద్యుత్, రోడ్లు, ఇళ్ల శుభ్రత పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ (Municipal), ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది (SDRF Staff) పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు (Electricity Department Officers) లైన్ పనులు పూర్తి చేశారు. కాలనీలో విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చే ముందు ఇళ్లలో ఉన్న ప్రజలను విద్యుత్ ప్రమాదం జరగకుండా ముందస్తుగా బయటకు పంపించారు. ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్ ట్రయల్‌రన్ చేపట్టారు. రాత్రి వరకు ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ట్యాంకర్ల ద్వారా నీటితో ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. ఇళ్లలో బురదలో ఉన్న సామాగ్రిని బయట వేసిన ప్రజలు ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకుంటూ ఇళ్లలోకి సర్దుకుంటున్నారు. మున్సిపల్ సిబ్బంది కాలనీలో చెత్త చెదారం లేకుండా క్లీన్ చేస్తున్నారు. ఇళ్ల వద్ద ఓపెన్ స్థలాల్లో గడ్డి బాగా పెరిగిపోవడంతో ఇప్పటికే పధికి పైగా పాములను చంపారు. దీంతో గడ్డిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. కాలనీవాసులకు పలువురు ఆహారం సరఫరా చేస్తున్నారు. రోటరీ క్లబ్, ఆర్కే సంస్థల ఆధ్వర్యంలో కాలనీవాసులకు భోజనం ఏర్పాటు చేశారు.