అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Year celebrations | కొత్త సంవత్సర వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ (Police Commissioner Sajjanar) అధికారులను ఆదేశించారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో (Telangana Command Control Center) శుక్రవారం ఆయన హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్‌జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేటి నుంచే పబ్‌లు, హోటళ్లు రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించినట్లు తెలిపారు. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా సైతం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
New Year celebrations | వారిపై నిఘా..
రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు సీపీ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడిన వారి జాబితా సిద్ధం చేశామన్నారు. వారి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలనూ ఆరా తీస్తున్నట్లు తెలిపారు. వేడుకల సందర్భంగా పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటి లైసెన్సులను రద్దు చేస్తామన్నారు.
New Year celebrations | చెక్‌పోస్టుల ఏర్పాటు
డిసెంబర్ 31న రాత్రి రద్దీ అధికంగా ఉండేమైత్రీవనం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బ్యారికేడింగ్ (checkposts and barricades) ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ వేడుకలపై కూడా నిఘా ఉంచాలని అధికారులకు చెప్పారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో డీసీపీలు ఎన్ శ్వేత, అపూర్వ రావు, రక్షిత కృష్ణమూర్తి, సిహెచ్. రూపేష్, చింతమనేని శ్రీనివాస్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీలు అందే శ్రీనివాస రావు, ఇక్బాల్ సిద్దిఖీ పాల్గొన్నారు.