అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే మెప్మా మహిళా సంఘాల (MEPMA womens associations) ద్వారా ప్రత్యేక రుణాలు అందజేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ పీడీ పవన్ కుమార్ తెలిపారు. నగరంలోని ఒకటో డివిజన్ కాలూరులో మంగళవారం అంగీకార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం ఆయా దశల్లో రూ.5 లక్షలు ఆర్థిక చేయూతనందిస్తుందని తెలిపారు. రుణాలు మంజూరైన లబ్ధిదారులు తొందరగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. బెస్మెంట్, గోడలు స్లాబ్ పూర్తయిన వారు ఆన్లైన్లో ఫొటోలను జియో ట్యాగ్ చేయాలని తెలిపారు.
ఇల్లు మంజూరైన లబ్ధిదారులు తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు (bank account) అనుసంధానం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇల్లు నిర్మాణం చేపట్టిన ఇందిరా అనే మహిళ సంఘ సభ్యురాలకు మెప్మా ద్వారా రూ.25వేలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ రమేష్, ఏఈ భూమేశ్వర్, వార్డు ఆఫీసర్ దినేష్, హరినాథ్, ప్రశాంత్, మెప్మా సీవో సరిత తదితరులు పాల్గొన్నారు.