అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ప్రస్తుతం తమ దృష్టంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలపైనే ఉందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (District SP Rajesh Chandra) అన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో గణేష్ మండపాల (Ganesh mandapams) నిర్వాహకులతో శనివారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ (police department) గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. వినాయకుని నెలకొల్పిన వారికి వారి సంతోషమే ముఖ్యమని, తమకు మాత్రం ప్రజల సంతోషంతో పాటు భద్రత కూడా ముఖ్యమేనన్నారు. ఇటీవల ఓ యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. విగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు ఏ సహాయం అవసరం అయినా పోలీస్ శాఖను సంప్రదించాలని సూచించారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నిమజ్జనం తేదీ కూడా తెలియజేయాలన్నారు. తనకు ట్యాంక్ బండ్‌పై (Tank Bund) 80 వేల గణేష్ విగ్రహాలను చూసిన అనుభవం ఉందని, చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమేనని ఎస్పీ తెలిపారు. మండపాల వద్ద అన్నదానాలు చేసేటప్పుడు ప్రజలకు సరిపడా ఏర్పాట్లు చేయాలని, ఒకరోజు ముందు తమకు సమాచారం ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
భారీ విగ్రహాలు, భారీ సెట్టింగ్స్ వేసే వారు ప్రజలు దర్శనానికి వెళ్లడానికి, బయటకు రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా సీసీ కెమెరాలు (CCTV cameras) ప్రతి మండపం వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం సమయంలో గణేష్ విగ్రహాలకు అవసరమైన మేరకు మాత్రమే వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు. చిన్న విగ్రహాలకు పెద్ద వాహనాలు ఏర్పాటు చేసుకోవద్దన్నారు. ఎవరైనా డ్రైవర్లు తాగే అవకాశం ఉంటే వాళ్లను పెట్టుకోవద్దని, నిమజ్జనం సమయంలో డ్రైవర్లతో ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలన్నారు.
వాహనాలు ఏవైనా రిపేర్ అయితే ఆర్టీసీకి సంబందించిన మెకానిక్‌లను తమ వద్ద అడ్వాన్స్‌గా ఉంచుతామని, వారి ద్వారా సమస్య పరిష్కరిస్తామన్నారు. డీజేలు కాకుండా డప్పు కళాకారులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి ఉపాధి కల్పించిన వారవుతారని, ఈ విషయంలో నిర్వాహకులు ఆలోచించాలన్నారు. నిమజ్జనం జరిగే రూట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. నూతన పద్ధతిలో శోభయాత్రకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కలెక్టర్ తాను స్వయంగా నిమజ్జనం రూట్లను పరిశీలించి నిమజ్జనం నాటికి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Kamareddy SP | సమస్యలు పరిష్కరిస్తాం: అదనపు కలెక్టర్
మండపాల నిర్వాహకులు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ (District Additional Collector Victor) తెలిపారు. ప్రతి ఒక్క మండపం వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సామరస్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మశాల క్రాస్ రోడ్ వద్ద కిందకు ఉన్న విద్యుత్ లైన్లను పైకి లాగామని, ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిగా మారిన పాంచ్ రాస్తా ట్రాన్స్ ఫార్మర్ ను శాశ్వతంగా తొలగిస్తామని తెలిపారు. బస్టాండ్ నుంచి టేక్రియాల్ వరకు విద్యుత్ లైన్లను సరిచేస్తామని తెలిపారు.
టేక్రియాల్ రోడ్డు (Tekriyal Road) నుంచి చెరువు వరకు ఉన్న లైన్ పైకి సరిచేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విద్యుత్ అధికారుల (electricity officials) ఫోన్ నంబర్లు ప్రతి మండపం వద్ద ఏర్పాటు చేస్తామని చెప్పారు. మండపాల వద్ద పర్మనెంట్ విద్యుత్ కనెక్షన్ ఇస్తామని, ఎవరు కూడా వైర్ల ద్వారా కొండి ఏర్పాటు చేయవద్దని సూచించారు. ఉత్సవాలు మొదలైన రోజు నుంచి ముగింపు వరకు విద్యుత్ రీడింగ్ నమోదు చేసుకుంటామని, వాటి వివరాలు ప్రభుత్వానికి పంపిస్తామని, నిర్వాహకులు ఒక్కరూపాయి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి (Additional SP Narasimha Reddy), ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
