అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Party Defections | రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సిద్ధం అయ్యారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం(Speaker Office) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన వారిలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు) ఉన్నారు.
Party Defections | సుప్రీం తీర్పుతో..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad Kumar) పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సైతం నోటీసులు పంపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో పలువురు తాము ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వారిని విచారించడానికి స్పీకర్ కార్యాలయం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
Party Defections | పదో షెడ్యూల్ ప్రకారం..
స్పీకర్ పదో షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై (MLA Disqualification Petition) విచారణ చేపట్టనున్నారు. సోమవారం స్పీకర్ పలువురు ఎమ్మెల్యేను విచారించనున్నారు. ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు, ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ చేపట్టారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటలకు మహిపాల్‌రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు.