అక్షరటుడే, వెబ్డెస్క్: Kishan Reddy | అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) స్పందించారు. అందరి ముందు పార్టీ మారితే పార్టీ మారలేదు అని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం విచారకరం అన్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అనంతరం కాంగ్రెస్ (Congress party) గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే అందులో ఐదుగురిపై అనర్హత పిటిషన్లను స్పీకర్ బుధవారం కొట్టివేశారు. వారు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
Kishan Reddy | వారే ప్రకటించారు..
పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారని, కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారని చెప్పారు. అయినా స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం అన్నారు. సదరు ఎమ్మెల్యేలు మీడియా, ప్రజల ముందు పార్టీలు మారినట్లు ప్రకటించారన్నారు. అన్ని రకాల రికార్డులు ఉన్నప్పటికీ వారు పార్టీ మారలేదని స్పీకర్ ప్రకటించడం విచారకరమన్నారు.
Kishan Reddy | ఫిరాయింపుల చట్టానికి తూట్లు
పార్టీ ఫిరాయింపుల చట్టానికి గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ తూట్లు పొడిచాయన్నారు. ఈ చట్టాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు. చట్టాలు, రాజ్యాంగం మీద ఈ రెండు పార్టీలకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. వారికి మంత్రి పదవులు సైతం ఇచ్చారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తుందన్నారు. రెండు పార్టీలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నవ్వులపాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులపై స్పందించాలని డిమాండ్ చేశారు.