Supreme Court
Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్​.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | పార్టీ ఫిరాయింపుల‌పై సుప్రీంకోర్టు గురువారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విష‌యంలో స‌భాప‌తి వీలైనంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. మూడు నెల‌ల లోపు నిర్ణ‌యం తీసుకోవాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం గడువు విధించింది. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న బీఆర్ఎస్‌ విజ్ఞ‌ప్తిని చీఫ్ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్, జ‌స్టిస్ జార్జ్ మ‌సీహ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తోసుపుచ్చింది. న్యాయ‌స్థాన‌మే వేటు వేయాల‌న్న విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు(Supreme Court) ధ‌ర్మాస‌నం.. ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. పేషెంట్ డైడ్ అన్న సూత్రం వ‌ర్తించ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించింది.

Supreme Court | సుదీర్ఘ విచార‌ణ‌..

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ (ఖైరతాబాద్), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్​పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్​చెరు), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్​ గౌడ్ (రాజేంద్రనగర్), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్​రెడ్డి (బాన్సువాడ).. అనంత‌రం కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేప‌థ్యంలో తమ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు(MLAs) పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్ళారని, వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని బీఆర్ఎస్(BRS) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అలాగే, దీనిపై సునిర్దిష్ట గడువు లోగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేలా ఆదేశించాల‌ని కోరుతూ బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR), ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద‌, జ‌గ‌దీశ్‌రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, చింతా ప్ర‌భాక‌ర్‌, క‌ల్వ‌కుంట్ల సంజ‌య్‌, బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి వేర్వేరుగా దాఖ‌లు చేనిన పిటిష‌న్ల‌ను సుమారు నాలుగు నెల‌ల పాటు విచారించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం గురువారం తుది తీర్పు వెలువ‌రించింది.

Supreme Court | గ‌డువు విధింపు..

అన‌ర్హత వేటు వేయాల‌న్న విజ్ఞప్తిని తిర‌స్క‌రించిన న్యాయ‌స్థానం.. ఫిరాయింపులపై స్పీక‌ర్‌(Speaker) నిర్ణ‌యం తీసుకునేందుకు గ‌డువు విధించింది. ఫిరాయింపుల వ్య‌వ‌హారంలో తెలంగాణ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఫిరాయింపుల‌పై వ‌చ్చిన పిటిష‌న్ల‌ను నెల‌ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉంచ‌డం కోర్టు స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డింది. దీనిపై వీలైనంత త్వ‌ర‌గా లేదా మూడు నెల‌ల్లో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. అదే స‌మ‌యంలో సర్వోన్న‌త న్యాయ‌స్థానం పార్ల‌మెంట్‌కు కీల‌క సూచ‌న చేసింది. స్పీక‌ర్‌కు కాల ప‌రిమితి విధించే అంశంపై పార్ల‌మెంట్(Parliament) నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది.

Supreme Court | అన‌ర్హ‌తపై స్పీక‌ర్‌దే నిర్ణ‌యం..

పార్టీ ఫిరాయింపుల‌పై బీఆర్ఎస్ పార్టీ(BRS Party) వేసిన పిటిష‌న్‌ను అనుమ‌తించిన న్యాయ‌స్థానం.. ఎమ్మెల్యేల అనర్హత విష‌యాన్ని మాత్రం తోసిపుచ్చింది. దానిపై స్పీక‌రే తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని తెలిపింది. అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న బీఆర్ ఎస్ విజ్ఞ‌ప్తిని తిర‌స్కరించింది. స్పీక‌ర్ కాలయాప‌న చేస్తున్నార‌న్న పిటిష‌న‌ర్ల‌తో ఏకీభ‌వించిన ధ‌ర్మాస‌నం.. స్పీక‌ర్‌ వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గ‌డువు విధించింది. స్పీక‌ర్ కు కోర్టులు గ‌డువు నిర్దేశించ‌జాల‌వ‌న్న స‌భాప‌తి త‌ర‌ఫున ముకుల్ రోహిత్గి(Mukul Rohitgi) చేసిన వాద‌న‌ల‌ను కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని చీఫ్ జ‌స్టిస్ గ‌వాయ్ స్పష్టం చేశారు. స్పీకర్ చర్య తీసుకోకపోతే.. నాలుగురు సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే, కోర్టులు చూస్తు ఉండ‌జాల‌వ‌ని తేల్చి చెప్పారు.