Spain Visa
Spain Visa | రూ.8 వేలకే స్పెయిన్​ వీసా.. ఏడాది పాటు అక్కడ ఉండొచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Spain Visa | స్పెయిన్​ (Spain) వెళ్లాలనుకే వారికి అక్కడి ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. రూ.8 వేలకే వీసా తీసుకొచ్చింది. దీని సాయంతో అక్కడ ఏడాది పాటు ఉండొచ్చు.

స్పెయిన్ ఇటీవల డిజిటల్ నోమాడ్ వీసాను ప్రవేశ పెట్టింది. యూరోపియన్​ యూనియన్ (EU)​ దేశాలకు చెందని వారి కోసం దీనిని అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. భారతీయ కరెన్సీలో రూ.8 వేలు చెల్లిస్తే చాలు వీసా లభిస్తుంది. ఈ వీసాతో ఏడాది పాటు స్పెయిన్​లో ఉంటూ పని చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక కండిషన్​ ఉంది. మీ సంపాదనలో కనీసం 80శాతం స్పెయిన్​ బయటి నుంచి రావాలి. అంటే ఈ వీసాపై వెళ్లి స్పెయిన్​లో పనిచేయడానికి కుదరదు.

Spain Visa | వీరికి అనుకూలం

ప్రస్తుతం చాలా కంపెనీలు వర్క్​ ఫ్రం హోమ్ (Work From Home)​ ఇస్తున్నాయి. అలాగే ఫ్రీలాన్స్​ వర్క్​ చేసే వారు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. ఇలాంటి వారికి స్పెయిన్​ వీసా ఉపయోగ పడుతుంది. ఇంటర్నేషనల్ టాలెంట్, ప్రొఫెషనల్స్, రిమోట్‌గా పనిచేసే వారిని స్పెయిన్‌కు ఆకర్షించడం కోసమే ఈ వీసా విధానాన్ని తీసుకొచ్చారు.

Spain Visa | ఎలా పొందాలంటే..

స్పెయిన్​ కొత్తగా ప్రవేశ పెట్టిన వీసా కోసం భారత్​ నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే టూరిస్ట్ వీసాపై అక్కడికి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే దరఖాస్తు చేసుకునేవారు రిమోట్‌గా పనిచేస్తున్నట్లు ప్రూఫ్​ ఉండాలి. ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. స్పానిష్​ కంపెనీకి కాకుండా ఇతర సంస్థలతో పని చేస్తుండాలి. సదరు కంపెనీ కోసం కనీసం మూడు నెలలుగా పని చేస్తున్న వారు ఈ వీసా పొందడానికి అర్హులు.