అక్షరటుడే, వెబ్డెస్క్ : Soya Farmers | ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు (Farmers) అవస్థలు తప్పడం లేదు. సోయా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సోయా సాగు అధికంగా చేపట్టారు. వానాకాలం సీజన్లో సుమారు 72 వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. అయితే పంట కోత దశలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో సోయాబీన్ (soybeans) రంగు మారింది. అధికారులు నిబంధనల పేరిట రంగు మారిన సోయాలను కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికే వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, రంగుమారిన పంటను సైతం కొనుగోలు చేయాలని రైతులు కోరతున్నారు. అధికారులు మాత్రం నిబంధనల పేరిట రంగు మారిన సోయాలను తిప్పి పంపుతున్నారు. దాదాపు నెల రోజులుగా సమస్యపై అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Soya Farmers | ఎల్లుండి ఆదిలాబాద్ బంద్
ఆదిలాబాద్ జిల్లా రైతులు పంట కొనుగోలు చేయాలని అధికారులను, నాయకులను కోరుతున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీ క్యాంపు ఆఫీసులను ముట్టడించారు. అంతకుముందు హైవేపై పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి సైతం యత్నించారు. అయితే ప్రభుత్వం మాత్రం సోయా కొనుగోళ్లపై ప్రకటన చేయడం లేదు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంతో ఈ విషయమై మాట్లాడమని చెప్పారు. అయితే పంట కొనకపోవడంతో రైతులు పోరుబాట పట్టారు. నాణ్యత లేదని కొనుగోలు చేసిన పంటను గోడౌన్ ఇన్‌ఛార్జ్‌లు తిప్పిపంపుతుండటంతో ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 2,700 సోయా బస్తాలు రిటర్న్ చేశారు. మరో మూడు లారీల్లోని సోయా పంటను కూడా రిజెక్ట్ చేశామని అధికారులు తెలిపారు. దీంతో రైతులు మంగళవారం ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు.
Soya Farmers | రైతుల దగ్గరే పంట
ఆదిలాబాద్ జిల్లాలో 24 వేల మంది రైతులు సోయా సాగు చేశారు. మొత్తం 4,32,000 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 6,280 మంది రైతుల వద్ద నుంచి 1.64 లక్షల క్వింటళ్లు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇంకా దాదాపు 2.80 లక్షల క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఎన్నో రోజులుగా తమ సమస్యను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.