అక్షరటుడే, వెబ్‌డెస్క్: Southwest Airlines | అమెరికాలోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం (SW Flight 1496) త్రుటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. హాలీవుడ్ బర్బాంక్ ఎయిర్‌పోర్టు (Hollywood Burbank Airport) (కాలిఫోర్నియా) నుంచి లాస్ వెగాస్‌కు బయలుదేరిన ఈ ఫ్లైట్ గగనంలో మరో విమానానికి అతి సమీపంలోకి వెళ్లింది.
విమానంలోని ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (plane Traffic Collision Avoidance System) రెండు హెచ్చరికలు జారీ చేయడంతో పైలట్ తక్షణమే అప్రమత్తమయ్యారు. మొదట విమానాన్ని పైకి తీసుకెళ్లిన వారు, ప్రమాదాన్ని పూర్తిగా తప్పించేందుకు వెంటనే 475 అడుగులు (సుమారు 145 మీటర్లు) కిందికి దించారు. వెంటనే తీసుకున్న నిర్ణయంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రెండు విమానాల మధ్య సమాంతర దూరం కేవలం 4.86 మైళ్లు (7.82 కి.మీ) మాత్రమే ఉంది. అజాగ్రత్తగా ఉండి ఉంటే రెండు విమానాలు గాల్లోనే ఢీకొనేవి.
Southwest Airlines | ప్రమాదం తప్పింది..
అయితే విమానం అకస్మాత్తుగా కిందకు దించడంతో విమానం లోపల తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రయాణికులు (Passengers) సీట్ల నుంచి గాలిలోకి లేచారు, కొందరు క్యాబిన్ పైకప్పుకు తాకి గాయపడ్డారు. ఇందులో ఇద్దరు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఓ ప్రయాణికురాలు కైట్లిన్ బర్డి, “దాదాపు 20-30 అడుగుల ఫ్రీఫాల్‌లా అనిపించింది. అందరూ భయంతో కేకలు వేస్తూ, విమానం (Flight) కూలిపోతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు” అని తెలిపారు. అలాగే విమానంలో ప్రయాణించిన ప్రఖ్యాత కమెడియన్ జిమ్మీ డోర్ కూడా, ఈ అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేస్తూ, “నా తల సీలింగ్‌కు తగిలింది” అంటూ తన అనుభవాన్ని వివరించారు.
సౌత్‌వెస్ట్ విమానానికి దగ్గరగా వచ్చింది హాకర్ హంటర్ (N335AX) అనే బ్రిటిష్ ఫైటర్ జెట్. అప్పుడు ఆ ఫైటర్ జెట్ 14,653 అడుగుల ఎత్తులో ఉండగా, సౌత్‌వెస్ట్ విమానం 14,100 అడుగుల్లో ప్రయాణిస్తోంది. హెచ్చరిక అనంతరం సౌత్‌వెస్ట్ విమానం ఒక్కసారిగా 13,625 అడుగులకు దిగింది. ఈ ఘటనపై సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ (South West Airlines) స్పందిస్తూ, “ఈ సంక్షోభ సమయంలో విమానాన్ని సురక్షితంగా నడిపిన పైలట్లకు అభినందనలు. మా ప్రయాణికుల భద్రతే మాకు ప్రథమకర్తవ్యం” అంటూ ప్రకటన విడుదల చేసింది. చివరికి విమానం లాస్ వెగాస్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.