అక్షరటుడే, హైదరాబాద్: South Zone Task Force raids : తెలంగాణ పోలీసులకు డ్రగ్స్ కట్టడి సవాలుగా మారింది. డ్రగ్స్, గంజాయిని నియంత్రిస్తున్న పోలీసులకు డ్రగ్స్ మాఫియా ఇంజక్షన్ల రాకెట్ రూపంలో సవాలు విసిరింది. హైదరాబాద్‌లో తాజాగా నిషేధిత ఇంజెక్షన్లు కలకలం సృష్టించాయి.
హైదరాబాద్ చాదర్ ఘాట్(Chadar Ghat), బండ్లగూడలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టి, నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 120 మెఫెన్ టెర్మిన్ ఇంజెక్షన్ బాటిళ్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ మలక్‌పేట్‌కి చెందిన యవార్ హుసైన్ నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 50 నిషేధిత ఇంజెక్షన్లను విక్రయిస్తుండగా పట్టుకుని, నిందితుడిని చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు.
మరో కేసులో బండ్లగూడ(Bandlaguda) కి చెందిన మహ్మద్ సల్మాన్, అబ్దుల్ వాలి నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లుగా అందిన సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. 70 నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకొని బండ్ల గూడ పోలీసులకు అప్పగించారు.
కాన్పులు, శస్త్ర చికిత్స(surgery)ల సమయంలో రోగికి నొప్పుల బాధలు తెలియకుండా ఈ మత్తు ఇంజక్షన్లు వాడతారు. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తు ఉంటుంది. ఇలాంటి ఇంజక్షన్లను యువత మత్తుకు ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.