అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Central Railway | దక్షిణ మధ్య రైల్వే ఆదాయం ఈ ఏడాది భారీగా పెరిగింది. 2025కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.దేశంలో రైల్వే శాఖ (Railway Department) నిత్యం కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది.
ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన హంగులతో వందే భారత్ రైళ్లను సైతం ప్రవేశ పెట్టింది. దీంతో రైళ్లలో రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా డిమాండ్‌కు తగ్గట్లు సర్వీసులు నడుపుతున్నారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు రికార్డు స్థాయిలో రూ.19,314 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది రూ.18,831 కోట్లు కాగా.. ఈ సారి రూ.483 కోట్లు ఎక్కువ రావడం గమనార్హం.
South Central Railway | వేగంగా అభివృద్ధి పనులు
దక్షిణ మధ్య రైల్వే నవంబరు వరకు రూ.19,314 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. సరుకు రవాణా ద్వారానే దక్షిణ మధ్య రైల్వేకు అధికంగా ఆదాయం వచ్చింది. 136.2 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.12,841 కోట్లు, ప్రయాణికుల నుంచి చార్జీల ద్వారా రూ.5,525 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ (Kachiguda Railway Station)లలో రద్దీని తగ్గించేందుకు ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అమృత్ పథకం కింద పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 68 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించి 22 ఆర్వోబీలు, 60 ఆర్‌యూబీలు నిర్మించినట్లు వెల్లడించారు.
South Central Railway | సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ (Sankranthi Festival)కు హైదరాబాద్ నగరంలో స్థిర పడిన వివిధ ప్రాంతాల ప్రజలు స్వగ్రామాలకు పయనం అవుతారు. దీంతో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. రెండు నెలల క్రితమే రెగ్యులర్ రైళ్లలో టికెట్లు బుక్ అయిపోయాయి. దీంతో రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అదనంగా మరో 11 స్పెషల్ ట్రైన్లు (Special Trains) నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లకు నేటి నుంచి రిజర్వేషన్ ప్రారంభం అయింది.