అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Central Railway | సికింద్రాబాద్(Secunderabad) కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఒకప్పుడు దేశంలోనే ఐదో స్థానంలో ఉన్న ఈ జోన్ ప్రస్తుతం తన స్థానాన్ని కోల్పోనుంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ(Railway Department) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జోన్ల విభజనతో దక్షిణ మధ్య రైల్వే పరిధి 6,400 కిలోమీటర్ల నుంచి 2500 కి.మీ.లకు తగ్గనుంది.
South Central Railway | ఘన చరిత్ర
దక్షిణ మధ్య రైల్వేకు ఘనమైన చరిత్ర ఉంది. నిజాం కాలంలో హైదరాబాద్ కేంద్రంగా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే(Nizam Guaranteed State Railway) సేవలు ఆరంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక 1966లో దీనిని దక్షిణ మధ్య రైల్వే జోన్‌గా ఏర్పాటు చేశారు. దీని పరిధిలో తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంతభాగంతో కలిపి మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. ఈ జోన్ పరిధిలో ప్రస్తుతం నిత్యం 650 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. 12 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
South Central Railway | విశాఖ కేంద్రంగా నూతన జోన్
కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దక్షిణకోస్తా జనరల్ మేనేజర్(South Coast General Manager) నియామకం కూడా పూర్తయింది. దీంతో మరి కొద్ది రోజుల్లోనే జోన్ విభజన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిధితో పాటు ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway)లో ఆరు డివిజన్లు ఉండగా.. విభజన తర్వాత మూడుకు తగ్గనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే జోన్ పరిధిలో ఉంటాయి.
South Central Railway | తగ్గనున్న ఆదాయం
ప్రస్తుతం ప్రయాణికులు ఏ జోన్ నుంచి తమ ప్రయాణం ప్రారంభిస్తే.. టికెట్లపై వచ్చే ఆదాయం కూడా ఆ జోన్‌కే చెందుతుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 12 లక్షల మంది ప్రయాణికుల ద్వారా రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుంది. విభజన తర్వాత ప్రయాణికులతో పాటు ఆదాయం కూడా తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్(Hyderabad)కు రాకపోకలు సాగించే వారి టికెట్ల ఆదాయం దక్షిణ కోస్తా జోన్‌కు వెళ్లనుంది.
South Central Railway | ఉద్యోగుల విభజన
జోన్ల విభజనలో భాగంగా ఉద్యోగులను కూడా విభజించనున్నారు. ప్రస్తుతం ఆయా డివిజన్ల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు యథావిధిగా కొనసాగుతారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రైల్ నిలయం, లేఖాభవన్, రైల్ నిర్మాణ్ భవన్, రైల్వే కేంద్రీయ ఆస్పత్రిలో సిబ్బందిని విభజించనున్నారు.