అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Central Railway | రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు, భద్రత మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర రైల్వే శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని (Amrit Bharat Station Scheme) అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
తెలంగాణ (Telangana)లో ఈ పథకం కింద 42 రైల్వే స్టేషన్లు ఎంపిక కాగా, వాటిలో అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, శిథిలావస్థకు చేరుకున్న పాత నిర్మాణాలను తొలగించే చర్యల్లో భాగంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూల్చివేయాలని నిర్ణయించింది.
South Central Railway | ఇక కనిపించదు..
సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి బేగంపేట వైపు ఉండగా, ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదానికి దారితీయవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. డిసెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్య ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) తొలగింపు పనులు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాత్కాలికంగా ఆంక్షలు విధించి రైళ్ల కార్యకలాపాలను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. బ్రిడ్జి కూల్చివేత పనుల కోసం సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కలిగే తాత్కాలిక అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన అధికారులు, ప్రజల సహకారం కోరారు.
నాంపల్లి రైల్వే స్టేషన్ (Nampally Railway Station)లోని ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నగరంలోని రెడ్ హిల్స్ ప్రాంతం మరియు పబ్లిక్ గార్డెన్ మధ్య అనుసంధానంగా ఉండేది. అయితే ఆసక్తికరంగా, ఈ బ్రిడ్జి స్టేషన్‌లోని ఏ ప్లాట్‌ఫారమ్‌కు కూడా అనుసంధానించలేదు. పైగా ఇది రైల్వే యార్డ్ లైన్ల మీదుగా ఉండటంతో, రైల్వే కార్యకలాపాలకు మరియు ప్రజలకు ప్రాణ ప్రమాదం కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కారణాలతోనే ఈ పాత బ్రిడ్జిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.