అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ind vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా నేడు రెండో టెస్ట్ ప్రారంభమైంది. తొలి టెస్టులో ఓటమి నెలకొన్న నేపథ్యంలో, శనివారం గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టు టీమ్‌ఇండియాకు (Team India) చావోరేవో పోరాటంగా మారింది.
దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈశాన్య భారతంలోని గువాహటి వేదికగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరుగుతుండడం ప్రత్యేకత. గువాహటిలో సాయంత్రం చీకటి తొందరగా పడడంతో, ఈ టెస్టు మ్యాచ్‌కు ప్రత్యేక సమయ వ్యవస్థను అమలు చేస్తున్నారు.
Ind vs SA | గెలిచి నిలుస్తారా..
టీ బ్రేక్ – ఉదయం 11 గంటలకు, లంచ్ బ్రేక్ – మధ్యాహ్నం 1.20 గంటలకు ఉంటుంది. అయితే స్వదేశంలో వరుస పరాజయాలతో ఒత్తిడిలో భారత్ ఉంది. కొత్త కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ ఎదుర్కొంది. అనంతరం కోల్‌కతా టెస్టును చేజేతులా వదులుకోవడంతో విమర్శలు మరింత పెరిగాయి. దశాబ్దకాలం వెన్నంట ఉన్న రికార్డు ఇప్పుడు చెరిగిపోతుంది. ప్రపంచ టెస్టు సమరాల్లో ఆధిపత్యం చాటిన భారత్, ఇప్పుడు తొలిసారి సొంతగడ్డపైనే కఠిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
తొలిటెస్టు నుంచే మెడనొప్పితో ఇబ్బంది పడుతున్న రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Captain Shubman Gill) రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో రిషబ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. గిల్ గైర్హాజరీతో భారత టాప్ ఆర్డర్‌పై మరింత ఒత్తిడి పడింది. డబ్ల్యూటీసీ ఛాంపియన్లు దక్షిణాఫ్రికా (South Africa) 2-0తో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బవుమా నేతృత్వంలో ఇప్పటికే పావులు కదుపుతోంది. స్పిన్ పిచ్‌లో సఫారీలను కట్టడి చేయాలనే భారత్ ప్లాన్ తిరగబడి, అదే ఊబిలో టీమ్ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ విజయం ప్రధానంగా సైమన్ హార్మర్‌ను ఎలా ఎదుర్కొంటుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. అయితే మళ్లీ సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గిల్ స్థానంలో సాయి సుదర్శన్ ఆడుతుండగా, బలమైన లోయర్ ఆర్డర్ కోసం అక్షర్ పటేల్ స్థానంలో తీసుకునే నితీష్ కుమార్‌ను తీసుకున్నారు.
Ind vs SA | జట్లు
భారత్: జైస్వాల్, రాహుల్, సుధర్శన్, జురెల్, పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నితీశ్ కుమార్, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.
దక్షిణాఫ్రికా: మార్క్రమ్, రికల్టన్, ముల్దర్ , టోనీ డీ జార్జి, బవుమా (కెప్టెన్), స్టబ్స్, వెరైన్, మార్కో జాన్సెన్, ముత్తుస్వామి హార్మర్, మహారాజ్.
