అక్షరటుడే, వెబ్‌డెస్క్: India vs South Africa | వైజాగ్ వేదికగా జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు ఏడు బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో ఛేదించారు.
ఆఖరి దశలో నాడిన్ డి క్లార్క్ పవర్ ఫుల్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా సౌతాఫ్రికా వైపు తిప్పింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సౌతాఫ్రికా (South Africa) ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపింది. ఆఖరి ఐదు ఓవర్లలో నాడిన్ డి క్లార్క్ సూపర్ హిట్టింగ్‌తో సఫారీలు విజయం దిశగా దూసుకెళ్లారు. ఓ దశలో భారత్ చేతుల్లో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా సౌతాఫ్రికా వైపు తిరిగింది.
చివరికి సఫారీలు 7 బంతులు మిగిలుండగానే 3 వికెట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించారు. ఈ విజయంతో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది.
India vs South Africa | విజయాలకు బ్రేక్..
ఓపెనర్లు ప్రతికా రావెల్ (29), స్మృతి మంధాన (35) మంచి ఆరంభం ఇచ్చినా మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ పతనం ఖాయం అనుకున్న వేళ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నిలబెట్టింది. 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసి టీమిండియా పరువు నిలబెట్టింది. స్నేహా రానా (33) సహకారంతో భారత్ 250 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించింది.
ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వరుస వికెట్స్ కోల్పోయింది. కేవలం 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ లారా వోల్వర్డ్ తన అనుభవాన్ని చూపించింది. 111 బంతుల్లో 8 ఫోర్లతో 70 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టింది. ఆమెతో కలిసి క్లో ట్రయన్ (49) , నాడిన్ డి క్లార్క్ (84 నాటౌట్) అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముఖ్యంగా డి క్లార్క్ చివరి ఓవర్లలో టీమిండియా బౌలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 నాటౌట్‌గా నిలిచి సౌతాఫ్రికాకు గెలుపు అందించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నాడిన్ డి క్లార్క్ అందుకుంది. ఈ విజయంతో సౌతాఫ్రికా పాయింట్స్ టేబుల్‌లో (Points Table) కీలక స్థానాన్ని దక్కించుకుంది. ఇక టీమిండియా వరుస విజయాల పరంపరకు ఈ ఓటమితో ముగింపు పలికింది.