అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Africa vs Pakistan | దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ Quinton Decock మరోసారి వార్తల్లో నిలిచాడు. రెండేళ్ల క్రితం వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్‌కీపర్-బ్యాటర్ ఇటీవల తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
దీంతో సఫారీ వన్డే జట్టులోకి తిరిగి అడుగుపెట్టాడు. 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌కు ముందు “ఇదే నా చివరి వన్డే టోర్నమెంట్” అంటూ గుడ్‌బై చెప్పిన డికాక్, ఆ తర్వాత ఈ ఫార్మాట్‌లో మళ్లీ ఆడబోనని స్పష్టంగా చెప్పాడు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
పాకిస్థాన్ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 8 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది. ఈ సిరీస్‌కు డికాక్ రెండు ఫార్మాట్లలోనూ ఎంపిక కావడం ప్రొటీస్ జట్టుకు అదనపు బలం ఇచ్చినట్టు అయింది.
South Africa vs Pakistan | రీఎంట్రీ అదుర్స్..
పాకిస్థాన్‌తో Pakistan జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శనతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు కేవలం 40.1 ఓవర్లలోనే ఛేదించడం విశేషం.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. సల్మాన్ ఆఘా (69), మహ్మద్ నవాజ్ (59), సయీమ్ అయూబ్ (53) అర్ధ సెంచరీలతో జట్టుకి గౌరవప్రదమైన స్కోరు అందించారు.
బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా తరఫున నాండ్రె బర్గర్ 4 వికెట్లు, న్గాబా పీటర్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత 270 పరుగుల ఛేజ్‌లో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ Decock తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే అద్భుత ఫామ్ చూపించాడు.
కేవలం 119 బంతుల్లో 123 నాటౌట్ (8 ఫోర్లు, 7 సిక్స్‌లు)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా టోనీ డి జోర్జి (63 బంతుల్లో 76) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
సెంచరీతో జట్టును విజయానికి నడిపిన క్వింటన్ డికాక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి వన్డే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది.డికాక్ తిరిగి జట్టులోకి రావడం, వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ , ఆ తర్వాతి వన్డే వరల్డ్ కప్ World Cup దృష్ట్యా దక్షిణాఫ్రికాకు శుభసూచకంగా భావిస్తున్నారు.
డికాక్ 2013లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 155 వన్డేల్లో 6770 పరుగులు (సగటు 45.75) చేసి, 21 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే 92 టీ20లలో 2584 పరుగులు, 54 టెస్టుల్లో 3300 పరుగులు చేశాడు.
