అక్షరటుడే, ఇందూరు: BJYM Nizamabad | ఎందరో గొప్పవ్యక్తుల కృషితో సోమనాథ్ ఆలయం పునర్మిర్మాణం జరిగిందని బీజేవైఎం (BJYM) రాష్ట్ర నాయకుడు పల్నాటి కార్తీక్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని కోటగల్లీలో భక్త మార్కండేయ ఆలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి, శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
BJYM Nizamabad | గజిని మహమ్మద్ దాడిలో..
భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రంపై 1026 జనవరిలో గజిని మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి వెయ్యేళ్లు అయ్యిందని కార్తీక్ అన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పిలుపుమేరకు నిజామాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆనాడు విదేశీ ఆక్రమణదారులు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా నేడు ఆ క్షేత్రం అత్యంత వైభవంగా వెలుగొందుతోందన్నారు.
BJYM Nizamabad | 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా..
ఆలయ పునరుద్ధరణ జరిగి 2026 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మన చారిత్రక కట్టడాలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని కార్తీక్ పేర్కొన్నారు. కోటగల్లిలోని మార్కండేయ ఆలయ ప్రాంగణాన్ని కాలనీవాసులతో కలిసి శుద్ధి చేసిన అనంతరం, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షుడు ఇప్పకాయల కిషోర్, ప్రధాన కార్యదర్శి దోర్నాల రవి, వాసం జయ, బల్ల లక్ష్మి, పల్నాటి శ్రీలక్ష్మి, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.