అక్షరటుడే, వెబ్‌డెస్క్: Software Employee Theft Case | ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దొంగగా మారాడు. లగ్జరి లైఫ్ కోసం తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలు అయ్యాడు.
విశాఖపట్నం (Visakhapatnam) నగరానికి చెందిన మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు దొంగగా మారాడు. తన విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనం చేసేవాడు. వరుస చోరీలకు పాల్పడుతున్న మహేష్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి, నగదు, ఒక బీఎండబ్ల్యూ కారు (BMW car), నంబర్ ప్లేట్ లేని ఒక స్కూటర్, దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.
Software Employee Theft Case | 26 ఇళ్లలో చోరీ
నగర పోలీసుల పరిధిలో సన్నీ 26 ఇళ్లలో చోరీ కేసులలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అతనికి బాల్యం నుంచే నేర చరిత్ర ఉందని పేర్కొన్నారు. కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వ్యక్తి చోరీల బాట పట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి, లగ్జరీ లైఫ్ కోసం ఉద్యోగాలు చేసే వారు సైతం నేరాల బాట పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ టెకీ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. డ్రగ్స్‌కు బానిసైన అతడు.. అనంతరం డబ్బుల కోసం ఆ దందాలోకి దిగాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ (Hyderabad)లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమ్మడం ప్రారంభించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.