అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Snake Waterfall | ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉంటాయి. అవి ఒక్కోసారి మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఇండోనేషియా(Indonesia)లోని ఓ జలపాతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాములను పోలిన రాళ్ల మధ్య నుంచి జలధారలు ప్రవహిస్తున్న ఈ జలపాతాన్ని స్నేక్ వాటర్‌ఫాల్ (Snake Waterfall) అని పిలుస్తున్నారు. అయితే అక్కడికి వెళ్లేందుకు కొంత ధైర్యం కావాల్సిందే అని అంటున్నారు. ఈ వీడియోను @AMAZlNGNATURE అనే ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయగా, ఇది పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్ చేస్తోంది.
Snake Waterfall | విచిత్రమైన నిర్మాణంతో..
ఈ అద్భుత దృశ్యం ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో (Bali Island) చిత్రీకరించబడింది. ఉబుద్‌కు సమీపంలో ఉన్న పుంగ్‌గుల్ ప్రాంతంలో ఉన్న ‘బేజీ గ్రియా వాటర్‌ఫాల్’ (Beji Griya Waterfall) ఇది. ఈ ప్రదేశానికి 2022 నుంచి పర్యాటకులకు అనుమతి ఇవ్వడం మొదలైంది. అప్పటి నుంచి ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది. జలపాతాన్ని చుట్టుముట్టిన రాళ్లు అయితే పాములు, అనకొండలు పాకుతున్నట్లుగా కనిపిస్తాయి. ఈ దృశ్యాలు చూసిన వారెవ్వరూ మరిచిపోలేరు.
వాస్తవానికి ఆ పాముల్లా కనిపించే రాళ్లు సహజసిద్ధంగా ఏర్పడినవి కాదు. ఇవి స్థానిక కళాకారులు తయారు చేసిన శిల్పాలు. బాలి కళ, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా వీటిని రూపొందించారు. ఈ రాళ్లపై నాచు, ఆల్గే పేరుకుపోవడం వల్ల, అవి సహజసిద్ధంగా ఏర్పడిన పాముల ఆకృతిలా కనిపిస్తూ, చూడ్డానికి పురాతన శిథిలాల భావనను కలిగిస్తాయి. ఈ జలపాతాన్ని స్థానికులు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేయడం ఆధ్యాత్మిక పవిత్రతకు సంకేతంగా భావించబడుతుంది. ఈ రకమైన ప్రత్యేక ఆకృతులు, కళాత్మకత, ప్రకృతి అద్భుతం మేళవించుకున్న ప్రదేశాలు ప్రపంచంలో మనకు చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి చూసిన తర్వాత మాత్రం మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
The rocks look like a giant petrified snake in this waterfall in Indonesia pic.twitter.com/WESFVHJq3N
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 15, 2025