అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indore | భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti mandhana), సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో రద్దయిన వార్త ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇది ఒక్క సెలబ్రిటీ వివాహానికే పరిమితం కాలేదని, దీని వెనుక ఒక పెద్ద సామాజిక మార్పు నడుస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గత 40 రోజుల వ్యవధిలోనే 150కి పైగా పెళ్లిళ్లు చివరి నిమిషంలో రద్దవడం సంచలనం సృష్టిస్తోంది.
Indore | సోషల్ మీడియానే ప్రధాన కారణం
‘దైనిక్ భాస్కర్’ కథనం ప్రకారం, రద్దైన వివాహాల్లో (MArriages) ఏకంగా 62 శాతం పెళ్లిళ్లకు కారణం సోషల్ మీడియానే. వధూవరుల పాత సోషల్ మీడియా పోస్టులు (social media posts), కామెంట్లు, ఫ్రెండ్ లిస్టులు, గత సంబంధాలపై ఆధారాలు వెలుగులోకి రావడంతో వివాదాలు చెలరేగి పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. గతంలో ఏర్పడిన రిలేషన్షిప్స్ గురించి పాత ఫోటోలు లేదా పోస్టుల ద్వారా తెలుసుకోవడంతో నమ్మకం దెబ్బతిని, కుటుంబాల మధ్య గొడవలు తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వివాహాలు కుటుంబంలో మరణాలు, అనారోగ్య సమస్యలు, లేదా పరస్పర విభేదాల కారణంగా రద్దైనట్లు నివేదిక వెల్లడించింది.
ఈ ట్రెండ్‌కు సంబంధించిన కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక సందర్భంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ (Pre wedding shoot) సమయంలో వధువు పాత సోషల్ మీడియా పోస్టులపై గొడవ తలెత్తడంతో పెళ్లినే రద్దు చేసుకున్నారు. మరో ఘటనలో, దాదాపు కోటి రూపాయల ఖర్చుతో నిర్వహించిన సంగీత్ వేడుక అనంతరం వధువు అదృశ్యమైంది. తర్వాత విచారణలో ఆమెకు మరొకరితో సంబంధం ఉన్నట్లు తేలింది.గతంలో వరకట్నం, కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా పెళ్లిళ్లు ఆగిపోయేవి.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 60 నుంచి 70 శాతం వివాహ రద్దు కేసులు సోషల్ మీడియాతో ముడిపడి ఉండటం గమనార్హం. ఈ పరిణామం ఇండోర్ వెడ్డింగ్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోటళ్లు, క్యాటరర్లు, డెకరేటర్లు, వెడ్డింగ్ ప్లానర్లు కలిసి సుమారు రూ.25 కోట్ల వరకు నష్టపోయినట్లు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమిత్ సూరి వెల్లడించారు. చివరి నిమిషంలో పెళ్లిళ్లు రద్దవడంతో అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాల్సి రావడం, ఏర్పాట్లన్నీ వృథా కావడం వ్యాపారాలను కుదిపేస్తోంది.