అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra Review | కేసుల దర్యాప్తులో పారదర్శకతను పెంచాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో (Kamareddy Police) నెలవారీ సమీక్ష (Police Review Meeting) నిర్వహించారు.
SP Rajesh Chandra Review | పెండింగ్ కేసుల్లో పురోగతిపై..
ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని (Case Investigation) డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి సమీక్షించారు. కేసు ఫైళ్లను పరిశీలించి తీవ్రమైన నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసులో పారదర్శకమైన విచారణ జరిపి బాధితులకు పోలీసులు (Telangana Police) కొండంత అండగా నిలవాలని, సత్వర న్యాయం అందేలా చూడాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారిస్తూ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా ప్రమాద పరిస్థితులను సమీక్షించి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రహదారులకు అడ్డుగా ఉన్న పొదలు..
రహదారులకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించడమే కాకుండా, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి హైవే అథారిటీ, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకుని సరిదిద్దాలని ఎస్పీ తెలిపారు. ప్రతిరోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎస్‌హెచ్‌వోలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకోవాలని, విలేజ్ పోలీస్ అధికారులు ముందస్తు సమాచార సేకరణలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.
రౌడీ షీటర్లు.. పాత నేరస్థుల కదలికలపై..
రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని, బ్లూకోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది పాపిలోన్ డివైస్ ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించాలని ఆదేశించారు. వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల ఆస్తి రక్షణే లక్ష్యంగా చోరీలు జరగకుండా రాత్రిగస్తీని, బీట్లను ముమ్మరం చేయాలని, ప్రజలకు చోరీల నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం..
మహిళా భద్రత, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యపర్చాలన్నారు. రానున్న రంజాన్ (Ramzan Security) పండుగను మతసామరస్యంతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసరావు, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మురళి, సీసీయస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.