అక్షరటుడే, ఆర్మూర్ : Sri Ram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్(Sri Ram Sagar)కు స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగింది. స్థానికంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద నీరు వస్తోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 2,579 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 277 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Sri Ram Sagar | నిలకడగా నీటిమట్టం
ప్రాజెక్ట్‌లోకి భారీ వరద రాకపోవడంతో నీటిమట్టం నిలకడగా ఉంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా గురువారం ఉదయానికి 1068.80 (21.369 టీఎంసీలు) అడుగులకు నీరు ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్‌లో 24.376 టీఎంసీల నీరు ఉండటం గమనార్హం. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్ట్‌లోకి వరదలు ప్రారంభం అయ్యాయి.
Sri Ram Sagar | బాబ్లీ గేట్లు ఎత్తినా..
గోదావరిపై ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను జులై 1న సుప్రీం కోర్టు తీర్పు మేరకు అధికారులు ఎత్తారు. అయితే ఎగువన వర్షాలు లేకపోవడంతో బాబ్లీ నుంచి ఎలాంటి వరద రావడం లేదు. స్థానికంగా కురుస్తున్న వర్షాలతోనే జలాశయంలోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 60 టీఎంసీలు చేరిన తర్వాతే పంటలకు సాగు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి(MLA Prashanth Reddy) ఇప్పటికే ఎస్ఈ శ్రీనివాస్‌గుప్తాను కోరారు.