అక్షరటుడే, వెబ్డెస్క్: SL vs AUS | టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక పెను తుపాను సృష్టించింది. పల్లెకెలె లో సోమవారం నిర్వహించిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి, శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా మ్యాచ్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచే వెళ్లిపోవాల్సి వచ్చింది. చరిత్రాత్మక విజయంతో శ్రీలంక సూపర్-8 దశలో స్థానం పొందింది.
టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) దూకుడుగా ఆడారు. దీంతో కంగారు జట్టు 8.3 ఓవర్లలోనే 104 పరుగులు చేసింది. ఆసిస్ పరుగుల పరంపర కొనసాగుతుండటంతో.. శ్రీలంక బౌలర్లు శివమెత్తారు. దీంతో దుషన్ హేమంత (3/37), దుష్మంత చమీర (2/36) ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. దీంతో 181 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి రెండు ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది.
SL vs AUS | భారీ లక్ష్యంతో..
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు పతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ మెరుపులు మెరిపించారు. నిస్సాంక 52 బంతుల్లోనే 100 పరుగులు చేయడం ద్వారా.. టీ20 ప్రపంచకప్ 2026లో మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. కుశాల్ మెండిస్ అర్ధ సెంచరీ చేయడంతో.. మరో 12 బాల్స్ ఉండగానే 18.2 ఓవర్లకే శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 వరల్డ్ కప్ పరంగా పరిశీలిస్తే.. లంక క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద రన్ ఛేజ్ కావడం గమనార్హం.
ప్రస్తుత వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. మొదట జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. గ్రూప్-బీలో వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఆస్ట్రేలియా సెమీస్ రేసు నుంచి తప్పుకోవడం ఖాయమైంది. శ్రీలంక సూపర్ 8 లో చేరింది. దాని తర్వాతి స్థానంలో జింబాబ్వే (4 పాయింట్లతో ) ఉంది. ఆస్ట్రేలియా ఇంకో మ్యాచ్ గెలిచి 4 పాయింట్లు అందుకున్నా.. జింబాబ్వేకు మెరుగైన రన్ రేట్ ఉండటంతో ఆస్ట్రేలియా బరిలో నిలవడం కష్టమని స్పష్టమవుతోంది.