అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Article 370 | జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు మంగళవారంతో ఆరేళ్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈ ఆరేళ్ల కాలంలో కశ్మీర్ లో అభివృద్ధి ఫలాలు వికసించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో శాంతిభద్రతలు వెల్లివిరియడంతో పర్యాటకుల రాక పెరగడంతో పాటు పెట్టుబడులు సైతం పెరిగాయి. జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ సమైక్యత వైపు చారిత్రాత్మకమైన సాహసోపేతమైన అడుగుగా భావించే ఈ నిర్ణయాన్ని బీజేపీ చేసి చూపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370ని రద్దు(Article 370 Repeal) చేసి కశ్మీర్‌ను భారత అభివృద్ధిలో భాగం చేసింది. కశ్మీర్‌ను రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి, లడఖ్ ప్రాంతాన్ని దాని నుంచి తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు రాష్ట్రంలో తీవ్ర గందరగోళానికి దారితీసిందని తొలుత ప్రాంతీయ పార్టీలు ఆరోపించినప్పటికీ, తర్వాతి కాలంలో మాత్రం మిన్నకుండి పోయాయి.
Article 370 | విజయవంతంగా ఎన్నికలు..
ఆర్టికల్ 370 రద్దు జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు ఢోకా లేకుండా పోయింది. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల బెడద చాలా వరకు తగ్గిపోయింది. దానికి తోడు ప్రజాస్వామ్యానికి కీలకంగా భావించే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) స్వేచ్ఛగా, విజయవంతంగా జరిగాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియపై కొత్త విశ్వాసాన్ని ప్రదర్శించారు. తద్వారా గతంలో ఉన్న అన్ని రికార్డులను తిరిగరాశారు. గతంలో కాకుండా, ఎన్నికలు ఎటువంటి నిరసనలు లేదా బహిష్కరణకు పిలుపులు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 63.88 శాతం పోలింగ్ నమోదైంది. గత 35 సంవత్సరాలలో ఎన్నడు నమోదు కానంత ఓటింగ్ శాతం లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) సందర్భంగా నమోదు కావడం గమనార్హం.
Article 370 | పర్యాటక వృద్ధి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగం అద్వితీయమైన వృద్ధిని సాధించింది. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకారం 2023లో 21.1 మిలియన్లకు పైగా ప్రజలు జమ్మూ కశ్మీర్‌ను సందర్శించారు. ఫలితంగా స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపు వచ్చింది. అయితే, పహల్గామ్ దాడి(Pahalgam Attack) తర్వాత పర్యాటకుల రాక కాస్త మందించింది. అయితే, ప్రస్తుతం మళ్లీ టూరిస్టుల సంఖ్య పెరిగింది.
Article 370 | మెరుగైన శాంతిభద్రతలు..
ఆర్టికల్ 370 రద్దుకు ముందు కశ్మీర్ నిత్యం అల్లకల్లోలంగా ఉండేది. భద్రతా దళాలపై తరచుగా రాళ్ల దాడి జరిగేది. కానీ ఆరేళ్లుగా అలాంటి ఘటనలు ఆగిపోయాయి. శాంతిభద్రతలు చాలా మెరుగయ్యాయి. 2023 తర్వాత ఒక్క రాళ్ల దాడి లేదా సమ్మె కేసు కూడా నమోదు కాలేదంటే పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
Article 370 | మౌలిక సదుపాయాల అభివృద్ధి
దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న కశ్మీర్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) అభివృద్ధి బాట పట్టించింది. ప్రధాన మౌలిక సదుపాయాలను అందించే అనేక ప్రాజెక్టులను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసింది. రూ. 42,500 కోట్లతో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ను ప్రారంభించడం కాశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన కూడా ఉంది. ఈ వంతెన జమ్మూ ప్రాంతాన్ని కశ్మీర్ లోయతో కలుపుతుంది. ప్రాంతీయ ఏకీకరణ, ఆర్థిక వృద్ధి, వ్యూహాత్మక రక్షణ చర్యలకు ఇది ఎంతో కీలకమైనది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంలో రూ.76,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కేంద్రం రూ.10,637 కోట్ల విలువైన 19 రోడ్డు, సొరంగ ప్రాజెక్టులను ఆమోదించింది.