అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గోహర్గంజ్కు చెందిన ఆరేళ్ల బాలికపై సల్మాన్ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. సెహోర్ జిల్లాకు చెందిన సల్మాన్ కూలీ పని కోసం గౌహర్‌గంజ్ (Gauharganj)కు వచ్చాడు. తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్లు ఇస్తానని తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. భోపాల్ (Bhopal)లోని ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Madhya Pradesh | టైర్ పంక్చర్ కావడంతో..
పోలీసులు అతడిని అరెస్ట్ చేసి గౌహర్గంజ్కు తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై సబ్-డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ షీలా సురానా (Sheela Surana) మాట్లాడుతూ.. నిందితుడిని తీసుకెళ్తుండగా.. తమ వాహనం టైర్ పంక్చర్ అయిందన్నారు. ఆ సమయంలో సల్మాన్ సబ్-ఇన్స్పెక్టర్ తుపాకీని లాక్కొని పరిగెత్తాడని చెప్పారు. అంతేగాకుండా పోలీసులపై కాల్పులు జరిపాడన్నారు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపడంతో గాయపడ్డాడని వివరించారు. వైద్యుల సలహా మేరకు తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4– 5 గంటల మధ్య జరిగింది.