అక్షరటుడే, వెబ్‌డెస్క్: ICC Rankings | ఇంగ్లండ్‌తో ముగిసిన తాజా అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో 23 వికెట్లు తీసి అద్భుతంగా రాణించిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకింగ్‌ను సాధించాడు.
ఓవల్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సహా మొత్తం 9 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్(Mohammad Siraj), ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ ఏడాది జనవరిలో సిరాజ్ కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ కాగా, ఇప్పుడు అది మరింత మెరుగుపడింది. ఐదో టెస్టు ముందు ఆయన 27వ స్థానంలో ఉండడం విశేషం. జస్‌ప్రీత్ బుమ్రా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ICC Rankings | సిరాజ్‌కి గ్రాండ్ వెల్‌కమ్..
బుమ్రా తర్వాత కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ 5లోకి ప్రవేశించాడు. అగ్రస్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (908 రేటింగ్ పాయింట్లు), రెండో స్థానంలో హ్యారీ బ్రూక్, తరువాత విలియమ్సన్, స్మిత్ ఉన్నారు. రిషభ్ పంత్ 8వ స్థానంలో కొనసాగుతుండగా.. శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్లలో జడేజా రాజ్యమేలుతున్నాడు. రవీంద్ర జడేజా టెస్టు ఆల్‌రౌండర్ల విభాగంలో 405 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
ఇక ఓవల్ టెస్టు (Oval Test) ముగిసిన వెంటనే లండన్ నుంచి ముంబై, అక్కడి నుంచి స్వగ్రామమైన హైదరాబాద్ చేరుకున్న సిరాజ్‌కి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport)లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అతడిని కలిసేందుకు వచ్చిన అభిమానులతో అక్కడే సందడి వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) కూడా సిరాజ్‌ను ఘనంగా సత్కరించాలనే యోచనలో ఉంది. ‘‘సిరాజ్‌ను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. అతడు మనందరినీ గర్వించేలా చేశాడు,’’ అని హెచ్‌సీఏ ప్రతినిధి తెలిపారు.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ‘రెడిట్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్‌కి అవసరమైనంత గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. అతడి అప్రోచ్ అద్భుతం. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు అదే ఉత్సాహం. ఓవల్ టెస్టులో 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడంటే ఆశ్చర్యమే. వేగాన్ని కోల్పోకుండా సుమారు వెయ్యి బంతులు వేయడం అతడి శక్తి, స్టామినా, ధైర్యానికి నిదర్శనం. జట్టు అవసరానికి తగిన విధంగా అప్పటికప్పుడు మ్యాచ్‌ను మార్చగలిగే పేసర్ అతడు.. ఇంకా అతడికి అవసరమైన గుర్తింపు ఇవ్వడం లేదు. అని బాధిస్తోంది అంటూ సచిన్ అన్నారు.