అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Groww IPO | ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ గ్రో (Groww) మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ పబ్లిక్ ఇష్యూ(Public issue)కు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ.6,632 కోట్లు సమీకరించనుంది.
బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్‌ను (Billion brains Garage Ventures) 2016లో ప్రారంభించారు. ఇది డైరెక్ట్ టు కస్టమర్ డిజిటల్ పెట్టుబడి ప్లాట్‌ఫాంలలో ఒకటి. తన క్లయింట్‌లకు స్టాక్‌లు, ఎఫ్‌అండ్‌వో(F&O), ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్, యూఎస్ స్టాక్ డెరివేటివ్స్, బాండ్‌లు, మ్యూచ్‌వల్ ఫండ్స్ తదితర ఉత్పత్తులలో సేవలను అందిస్తోంది. ఈ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి దేశంలోని 98.36 శాతం పిన్‌కోడ్‌లను కవర్ చేస్తోంది. ప్రస్తుతం 12.6 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో పెద్ద స్టాక్ బ్రోకర్(Stock broker)గా ఎదిగింది.
Groww IPO | 26 శాతం మార్కెట్ వాటా
ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 6,632 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఐపీవో(IPO)కు వస్తోంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 1,060 కోట్లు సమీకరించనుంది. మిగిలిన మొత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్(OFS) రూపంలో రూ. 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించనున్నారు. ఐపీవోలో ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా సమీకరించిన నిధులను బ్రాండ్ బిల్డింగ్, కొత్త ప్రొడక్టుల లాంచింగ్, టెక్నాలజీపై పెట్టుబడికి వినియోగించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఆర్థిక పరిస్థితి : 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రో రూ. 2,795.99 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం(Revenue) రూ. 4,061.65 కోట్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 805.45 కోట్ల నష్టం నమోదవ్వగా.. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,824.37 కోట్ల నికర లాభాన్ని(Net profit) సంపాదించింది. ఆస్తులు రూ. 8,017.97 కోట్లనుంచి రూ. 10,077.31 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో గ్రో వేదికగా రూ. 34 వేల కోట్లు సిప్ రూపంలో మ్యాచువల్ ఫండ్స్‌లోకి వెళ్లాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఇది 11.8 శాతం.
ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ధరల శ్రేణి(Price band)ని రూ. 95 రూ. 100గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 150 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 15 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్ వేయవచ్చు.
కోటా, జీఎంపీ : కంపెనీ 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB)కు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 13 గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 13 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : నవంబర్ 4 ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) ప్రారంభమవుతుంది. 7వ తేదీ వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంది. 10వ తేదీన రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడవుతుంది. నవంబర్ 12న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. నవంబర్ 3న యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది.

