అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sikhar Dhawan | భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లోకి వచ్చాడు. మైదానంలో దూకుడు ఆటతీరుతో అభిమానులను అలరించిన ‘గబ్బర్’, ఇప్పుడు జీవితంలో మరో కీలక మలుపు తీసుకోబోతున్నట్లు సమాచారం.
చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ (Sophie Shine)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ధావన్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ జంట మొదటిసారి 2025లో దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా కలిసి కనిపించడంతో వారి రిలేషన్‌పై చర్చ మొదలైంది. అప్పట్లో బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, స్టేడియంలో వారి సాన్నిహిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
Sikhar Dhawan | ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఆ తర్వాత కొద్ది నెలలకే, మే 2025లో ఇద్దరూ కలిసి ఫోటోను సోషల్ మీడియా (Social Media)లో పంచుకోవడం ద్వారా తమ బంధాన్ని అధికారికంగా ధృవీకరించారు. అప్పటి నుంచి వీరి రిలేషన్‌పై ఆసక్తి మరింత పెరిగింది. సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన ప్రొడక్ట్ కన్సల్టెంట్. లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం అబుదాబిలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. వృత్తి పరంగా స్థిరపడిన సోఫీ, శిఖర్ ధావన్ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటోంది. ధావన్ ఫౌండేషన్ (Dhawan Foundation)తో ఆమెకు అనుబంధం ఉండటమే కాకుండా, స్పోర్ట్స్ మరియు సామాజిక సేవల కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ధావన్ ఆడుతున్న సమయంలో కూడా సోఫీ అతనితో కలిసి కనిపించింది. అప్పట్లో ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వారి బంధం అప్పటికే బలపడినట్లు అర్థమవుతోంది. మీడియా కథనాల ప్రకారం, శిఖర్ ధావన్ – సోఫీ షైన్‌ల వివాహం ఫిబ్రవరి మూడో వారంలో జరగనుందని సమాచారం. ఢిల్లీ–ఎన్‌సిఆర్‌లో నిర్వహించనున్న ఈ వేడుకను పూర్తిగా ప్రైవేట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలోనే వివాహ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదివరకు ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2012లో జరిగిన ఈ వివాహానికి ముగింపు పలుకుతూ, 2023 అక్టోబర్‌లో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. ఆ సమయంలో వ్యక్తిగతంగా ఎన్నో మానసిక ఒత్తిడులను ఎదుర్కొన్న ధావన్, ఇప్పుడు కొత్త జీవితానికి సిద్ధమవుతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. తన కుమారుడిని మిస్ అవుతున్నప్పటికీ, జీవితంలో మళ్లీ ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతున్న గబ్బర్ నిర్ణయం అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది.