అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shweta Basu | టాలీవుడ్‌లో (Tollywood) ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటి శ్వేతా బసు ప్రసాద్ (actress Shweta Basu Prasad)జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న ఆమె, ఆ సినిమాతోనే యువతలో క్రేజ్ సంపాదించింది. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో కెరీర్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ఆమెపై నమోదైన వివాదాస్పద కేసు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. తర్వాత ఆ కేసులో ఆమె నిర్దోషిగా తేలినా, అప్పటికే ఇండస్ట్రీలో అవకాశాలు దూరమయ్యాయి.
Shweta Basu | ఆ ప్రాంతాలకి వెళ్లా..
కొన్నాళ్లు తెర వెనకకు వెళ్లిన శ్వేతా, ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను (Rohit Mittal) వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఏడాది కూడా పూర్తికాకముందే ఇద్దరూ విడిపోయారు. వరుసగా వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఆమె కెరీర్‌పై కూడా ప్రభావం చూపాయి. అయినప్పటికీ, శ్వేతా పూర్తిగా వెనక్కి తగ్గలేదు. మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో శ్వేతా బసు ప్రసాద్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గతంలో ఒక పాత్ర కోసం చేసిన ప్రయత్నాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
లాక్‌డౌన్ సమయంలో తెరకెక్కిన ‘ఇండియా లాక్‌డౌన్’ అనే చిత్రంలో ఆమె (Swetha Basu) ఓ కీలక పాత్రలో నటించింది. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ముంబైలోని కామాటిపురా ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి అక్కడి మహిళల జీవన పరిస్థితులను తెలుసుకున్నట్లు అప్పట్లో ఆమె వెల్లడించింది. పాత్ర కోసం చూపిన ఈ నిబద్ధతకు ఆమెకు ప్రశంసలు కూడా లభించాయి. ఇదిలా ఉండగా, తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన అనుభవాల గురించి కూడా శ్వేతా ఓ సందర్భంలో మాట్లాడింది. ‘కొత్త బంగారు లోకం’ తర్వాత అదే స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన బాధను వ్యక్తం చేసింది. అలాగే, ఒక సౌత్ సినిమా షూటింగ్ సమయంలో తన ఎత్తు కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పింది. హీరో చాలా పొడవుగా ఉండటంతో, తనను ఎగతాళి చేశారని, ఈ విషయాలు అప్పట్లో తనను మానసికంగా కలిచివేశాయని తెలిపింది.