Homeఅంతర్జాతీయంAmerica Shutdown | అమెరికాలో ముగిసిన షట్​డౌన్​

America Shutdown | అమెరికాలో ముగిసిన షట్​డౌన్​

అమెరికాలో షట్​డౌన్​ ముగిసింది. 43 రోజుల పాటు కొనసాగిన షట్​డౌన్​ ముగింపు కోసం నిధుల బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్​ సంతకం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America Shutdown | అగ్రరాజ్యం అమెరికాలో షట్​డౌన్​ ముగిసింది. రెండు ఆర్థిక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం షట్​డౌన్ (America Shutdown) అయిన విషయం తెలిసిందే. అక్టోబర్​ 1 నుంచి కొనసాగిన ఆర్థిక షట్​డౌన్​ బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ముగిసింది.

అమెరికా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి అవసరమైన నిధుల బిల్లులను సెనెట్​ ఆమోదించలేదు. దీంతో అక్టోబర్​ 1 నుంచి షట్​డౌన్ ప్రారంభమైంది. దీని ప్రభావంతో అగ్రరాజ్యంలో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు దానికి ముగింపు పలికే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) సంతకం చేశారు. కాగా.. 43 రోజుల పాటు ప్రభుత్వం షట్ డౌన్​ అయింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతి పెద్దది కావడం గమనార్హం. గతంలో ట్రంప్​ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజులు ప్రభుత్వం షట్​డౌన్​ అయింది. తాజాగా ఆ రికార్డ్​ బ్రేక్​ కావడం గమనార్హం. షట్​డౌన్​తో 20 వేల విమానాల రద్దు లేదా ఆలస్యం, ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోల్పోవడానికి డెమొక్రాట్లే కారణమని ట్రంప్​ ఆరోపించారు.

America Shutdown | బిల్లుకు ఆమోదం లభించడంతో..

షట్​డౌన్​ ముగించడానికి అవసరమైన బిల్లు ప్రతినిధుల సభలో 222-209 తేడాతో ఆమోదం పొందింది. అనంతరం నిధుల బిల్లుపై ట్రంప్​ సంతకం చేశారు. బిల్లుపై సంతకం చేస్తున్న సమయంలో ట్రంప్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ల షట్‌డౌన్ భారీ నష్టాన్ని కలిగించిందన్నారు. లక్షలాది మంది అమెరికన్లకు ఆహార స్టాంప్ ప్రయోజనాలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షట్‌డౌన్ మొత్తం ప్రభావం గురించి మాట్లాడుతూ.. దానిని అంచనా వేయడానికి వారాలు పడుతుందన్నారు. మనం ఎప్పుడూ దోపిడీకి లొంగిపోమని స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నామని స్పష్టం చేశారు.

US చరిత్రలో అత్యంత పొడవైన ప్రభుత్వ షట్‌డౌన్ తర్వాత ఫెడరల్ బ్యూరోక్రసీని (Federal Bureaucracy) తిరిగి ప్రారంభించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. రవాణా కార్యదర్శి సీన్ డఫీ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాన విమానాశ్రయాలలో విమాన ఆంక్షలు ఎత్తివేయబడడానికి ఒక వారం సమయం పడుతుందని అంచనా వేశారు. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రభావితమైన కార్మికులందరికీ జీతాలు చెల్లించనున్నారు. దాదాపు 6,70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి పనిలోకి వస్తారని భావిస్తున్నారు. 60 వేల కంటే ఎక్కువ మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (Air Traffic Controllers) మరియు విమానాశ్రయ భద్రతా సిబ్బందితో సహా జీతం లేకుండా పని చేస్తూనే ఉన్న మరో ఇలాంటి సంఖ్యకు తిరిగి జీతం లభిస్తుంది.

Must Read
Related News