అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shreyas Iyer | ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడు. అతడి ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఐసీయూలో చికిత్స అందించిన విషయం తెలిసిందే.
అయితే అయ్యర్‌కు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని బీసీసీఐ (BCCI) ప్రకటించింది.గత వారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీ గాల్లోకి లేపిన బంతిని పట్టుకునే సమయంలో అయ్యర్ కింద పడటంతో గాయపడ్డాడు. దీంతో అతడికి అంతర్గత రక్తస్రవం కావడంతో బీసీసీఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించింది. తాజాగా ఆయన ఆరోగ్యంపై బీసీసీఐ వర్గాలు వివరాలు వెల్లడించాయి. వైద్యులు ఊహించిన దానికంటే అయ్యర్ (Shreyas Iyer) త్వరగా కోలుకుంటున్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
Shreyas Iyer | విశ్రాంతి అవసరం
అయ్యర్‌కు శస్త్రచికిత్స (Surgery) అవసరమని మంగళవారం వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సైకియా స్పందించారు. అంతర్గత రక్త స్రవం ఆపడానికి శ్రేయస్‌కు శస్త్రచికిత్స చేయలేదన్నారు. కానీ వేరే ప్రక్రియ జరిగిందని తెలిపారు. అతడు త్వరగా కోలుకుంటున్నాడని, ప్రస్తుతం అతడికి విశ్రాంతి అవసరం అని చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత శ్రేయస్ తిరిగి వస్తాడని చెప్పారు. అతడిని ఐసీయూ నుంచి ఆసుపత్రిలోని తన గదికి తరలించారని తెలిపారు. సోషల్ మీడియా ఛానళ్లలో శ్రేయస్‌కు శస్త్రచికిత్స జరిగినట్లు వార్తలు వచ్చాయన్నారు. అందులో నిజం లేదని స్పష్టం చేవారు. ప్లీహంలో రక్తస్రావం ఆపేందుకు భిన్నమైన వైద్య ప్రక్రియను చేపట్టారని చెప్పారు. దీంతో త్వరగా కోలుకుంటున్నాడన్నారు.

