అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shreyas Iyer | సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. గాయం తర్వాత తొలిసారిగా ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన హెల్త్ అప్‌డేట్‌ను పంచుకున్న శ్రేయస్ అయ్యర్, (Shreyas Iyer) “ప్రస్తుతం నేను రికవరీ ప్రాసెస్‌లో ఉన్నాను. ప్రతి రోజూ కొంచెం కొంచెంగా బాగవుతున్నాను. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అభిమానులు, సహచరులు, స్నేహితులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహం నాకు ఎంతో ప్రేరణనిస్తోంది” అంటూ పేర్కొన్నారు.
Shreyas Iyer | హెల్త్ అప్‌డేట్..
గత వారం ఆస్ట్రేలియా టూర్‌లోని (Australia Tour) మూడో వన్డేలో ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ గాయపడ్డారు. హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని థర్డ్‌మ్యాన్ దిశలో డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ పట్టిన వెంటనే ఎడమ పక్కటెముల వద్ద నొప్పితో విలవిలలాడారు. వైద్య పరీక్షల అనంతరం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తేలడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. సిడ్నీలోని ఆసుపత్రిలో రెండు రోజులు ఐసీయూలో చికిత్స పొందిన అయ్యర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన పూర్తి రికవరీకి మూడు వారాలు పట్టవచ్చని తెలుస్తోంది.
డిసెంబర్ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ఆయన అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆయన త్వరగా మైదానంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం గురించి బీసీసీఐ కూడా కీలక అప్‌డేట్ ఇచ్చింది. ‘శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిని మేం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అతడి విషయంలో వైద్యుల సలహాలను పాటిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి అతడికి పెద్ద ప్రమాదం లేదని చెప్పారు. జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు ఆడడానికి ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాం’ అని బీసీసీఐ (BCCI) వర్గాలు వెల్లడించాయి.

