Homeభక్తిShravana Masam | శ్రావణం.. శుభాలనొసగే వ్రతాల మాసం

Shravana Masam | శ్రావణం.. శుభాలనొసగే వ్రతాల మాసం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shravana Masam | స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు(Shri Maha Vishnu)కు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మి(Maha Lakshmi)కి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణం(Shravanam). పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ నెలను శ్రావణ మాసం అని పిలుస్తారు.

శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యాలను ఇస్తాయని పేర్కొంటున్నారు ఆధ్యాత్మికవేత్త రుద్రమణి శివాచార్య. ఇది ఆధ్యాత్మికంగా విశిష్టతలున్న నెల. అందుకే భక్తులు నెలరోజులపాటు వ్రతాలు, నోములు, పూజలు నిర్వహిస్తారు. శ్రావణమాసం మహిళల(Women)కు ఎంతో పవిత్రమైనది. మహిళలు ఎక్కువగా వ్రతాలను పాటించే నెల కాబట్టి దీనిని వ్రతాల మాసమని కూడా పిలుస్తారంటున్నారు. ఈనెలలో మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతంతోపాటు నాగచతుర్థి, పుత్రదా ఏకాదశి, రక్షాబంధన్‌, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పొలాల అమావాస్య వస్తాయి. వాటి గురించి రుద్రమణి శివాచార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మంగళగౌరి వ్రతం:శ్రావణ మాసం(Shravana masam) లో మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు(Tuesday) ఈ వ్రతం చేస్తారు. పార్వతి దేవికి మరొక పేరు మంగళగౌరి(Mangala Gouri). సాధారణంగా కొత్తగా పెళ్లయినవారు ఈ వ్రతం ఆచరిస్తారు. దీనివల్ల మహిళలకు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ వ్రతాన్ని గురించి శ్రీకృష్ణుడు(Shri Krishna) ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

వరలక్ష్మి వ్రతం:శ్రావణ మాసంలో మహిళలు చేసే అతి ముఖ్యమైన వ్రతం శ్రీవరలక్ష్మి వ్రతం. దీనిని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం(Friday) ఆచరిస్తారు. ఈ రోజున వరలక్ష్మిని పూజిస్తే శుభాలు, సంపదలు కలుగుతాయన్న భక్తుల విశ్వాసం.

నాగచతుర్థి:శ్రావణమాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి(Chaviti)ని నాగులచవితిగా జరుపుకుంటారు. ఈరోజు భక్తులు నాగ పూజలు చేస్తారు.

పుత్రదా ఏకాదశి:శ్రావణ శుద్ధ ఏకాదశి(Ekadashi)ని పుత్రదా ఏకాదశి అని, లలిత ఏకాదశి అని అంటారు. ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

రాఖీ పౌర్ణమి:సోదరుల శ్రేయస్సు కోరుతూ అక్కాచెల్లెళ్లు చేతికి రాఖీ కట్టే పండుగిది. ఈ రోజునే పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారంగా వస్తోంది. అందుకే ఈ రోజును జంధ్యాల పూర్ణిమ అనికూడా పిలుస్తారు.

హయగ్రీవ జయంతి:వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు పౌర్ణమి రోజునే హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు(Hayagreeva) జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొంటారు. హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్లు చేసి నైవేద్యం సమర్పిస్తారు.

శ్రీకృష్ణాష్టమి:కృష్ణపక్ష అష్టమిని జన్మాష్టమి(Janmastami)గా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినాన్ని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు కృష్ణుడిని పూజించి, ఉట్టిని కొట్టడం ఆచారంగా వస్తోంది.

కామిక ఏకాదశి:శ్రావణంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేస్తే ఈతి బాధలు పోయి, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

పొలాల అమావాస్య:శ్రావణ మాసంలో చివరి రోజును పొలాల అమావాస్య (Amavasya)గా జరుపుకుంటారు. పోలేరమ్మను ఆరాదిస్తారు.