అక్షరటుడే, నిజాంసాగర్: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్ కొరడా జులిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పలువురు డెంగీ, ఇతర విష జ్వరాల బారిన పడడంతో కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ సీహెచ్‌సీ (Jukkal CHC) సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. జుక్కల్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రికి సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆనంద్, డ్యూటీ డాక్టర్ విఠల్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ సీరియస్ ఆయ్యారు. తక్షణమే వారిరువురికి షోకాజ్‌లు జారీ చేయాలని డీసీహెచ్ఎస్ విజయలక్ష్మికి ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రబలుతున్న ఈ సమయంలో వైద్యులు సమయానికి ఆస్పత్రిలో లేకపోవడం తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జుక్కల్ తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.