అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP National Leader | భారతీయ జనతా పార్టీ కొత్త సారథి ఎవరన్న దానిపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఈసారి మహిళకు అవకాశం కల్పించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బీజేపీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా నాయకురాలు జాతీయ అధ్యక్షురాలిగా(National President) బాధ్యతలు చేపట్టిన ఘనత పొందుతారు. రాష్ట్రాల్లోని పార్టీ కార్యవర్గాల నియామకం కొలిక్కి వచ్చింది. సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన నాయకత్వం.. ఇప్పటికే ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కొత్త అధ్యక్షులను నియమించింది. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి నియామకంపై చర్చలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అందులో మహిళా నేతల పేర్లు కూడా ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే బీజేపీ చరిత్రలో ఓ మహిళకు జాతీయ పార్టీ బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి అవుతుంది.
BJP National Leader | పరిశీలనలో సీతారామన్, పురంధేశ్వరి..
ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పదవీ కాలం ఎప్పుడో ముగిసిపోయింది. 2020 నుంచి ఆయన పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్నారు. ఆయన పదవీకాలం 2023లో ముగిసింది. కానీ వివిధ రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఆయనను 2024 వరకు పొడిగించింది. ఆయన సారథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. అందుకే బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గాల వరకు ఎన్నికలు పూర్తి చేసింది. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడితో పాటు కార్యవర్గ కూర్పుపై బీజేపీ తలమునకలై ఉంది. ఈ క్రమంలో కొత్త సారథిగా మహిళకు ఛాన్స్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. కీలక పదవిని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సస్పెన్స్ మిగిలి కొనసాగుతున్నప్పటికీ, ఈసారి మొట్టమొదటిసారిగా మహిళ బీజేపీకి జాతీయ అధ్యక్షురాలిగా వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeshwari), తమిళనాడుకు చెందిన ఎంపీ వనతి శ్రీనివాసన్(MP Vanathi Srinivasan) లలో ఒకరికి కాషాయ సారథిగా అవకాశం లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. తొలిసారి ఓ అతివను పార్టీ చీఫ్‌గా నియమించడం ద్వారా మహిళలను ఆకర్షించడంతో ప్రతిపక్షాలను సెల్ఫ్ డిఫెన్స్‌లోకి నెట్టవచ్చన్న వ్యూహం దీని వెనుక ఉందని భావిస్తున్నారు.
BJP National Leader | నిర్మలా సీతారామన్
బీజేపీలో అత్యంత ప్రభావితమైన నాయకులలో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఒకరు. కాషాయ పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఆమె ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకులలో ఒకరైన ఆమెకు జాతీయ అధ్యక్షురాలిగా అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మరోవైపు, నిర్మలా సీతారామన్ ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను కూడా కలిసి చర్చించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ఆమెను పార్టీ చీఫ్‌గా నియమిస్తే ఆ రాష్ట్రంలో బీజేపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై ఫోకస్ చేసిన పార్టీ నాయకత్వం.. ఈ ప్రాంతానికి చెందిన వారికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది.
BJP National Leader | పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన డి.పురంధేశ్వరి పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. గతంలో కేంద్ర మంత్రిగా, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం ఆమెకు ఉన్నది. ఎన్టీఆర్ బిడ్డగా, మంచి వక్తగా, అందరితో కలుపుగోలుగా ఉండే పురంధేశ్వరికి బీజేపీ నాయకత్వం అవకాశం కల్పించవచ్చని చెబుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్‌లలో దేశ ఉగ్రవాద వ్యతిరేక వైఖరికి ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వ ఆపరేషన్ సిందూర్ ప్రతినిధి బృందంలో ఆమె కూడా ఒకరు.
BJP National Leader | వనతి శ్రీనివాసన్
తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ గతంలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గంలో పోటీ చేసిన ఆమె.. మక్కల్ నీది మయ్యం (MNM) వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ను ఓడించి అందరి దృష్టిలో పడ్డారు. 1993 నుంచి బీజేపీతో ఆమె సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్నారు. 2022లో కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది.
BJP National Leader | మహిళ వైపు మొగ్గు..
బీజేపీ నాయకత్వం ఎవరి అంచనాలకు అందని రీతిలో కొంతకాలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ నిర్మాణం నుంచి మొదలు ముఖ్యమంత్రుల ఎంపిక వరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త విధానాలను పాటిస్తోంది. ఇప్పుడు జాతీయ సారథి విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశముంది. ఇటీవలి కాలంలో మహిళా ఓటర్లను ప్రభావితం చేయడంలో బీజేపీ విజయం సాధించింది. ఇది ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మహిళను నియమించాలని చూస్తున్న కారణాలలో ఒకటి కావచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Central Government).. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలకమైన బిల్లును ఆమోదించిన నేపథ్యంలో.. మహిళను సారథిగా చేయడం ద్వారా దేశవ్యాప్తంగా మహిళా ఓట్లను తమ వైపు మళ్లించుకోవచ్చన్న భావనలో బీజేపీ(BJP) ఉందని భావిస్తున్నారు.