అక్షరటుడే, వెబ్‌డెస్క్: JD Vance | అమెరికాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (US Vice President JD Vance) ఇంటిపై రాత్రిపూట కాల్పులు జరిగాయి.
ఒహయో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కిటికీలు ధ్వంసం అయ్యాయి. అయితే ఘటన జరిగిన సమయంలో వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. కాల్పుల విషయమై సమాచారం అందుకున్న సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు స్పందించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
JD Vance | నిందితుడి అరెస్ట్
ఒక అధికారి మాట్లాడుతూ.. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో వాన్స్ కుటుంబం లేదన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఉపాధ్యక్షుడి ఇంట్లోకి ప్రవేశించలేదని అధికారులు భావిస్తున్నారు. నూతన సంవత్సర సెలవుల (New Year holidays) సందర్భంగా ఆ ప్రాంతంలో భద్రతను పెంచిన తర్వాత ఈ సంఘటన జరిగింది. వాన్స్ నివాసం చుట్టూ ఉన్న రోడ్లు ఆదివారం వరకు చాలా రోజులు మూసివేశారు. కాగా పోలీసులు ఘటన స్థలంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది అతడేనని అనుమానిస్తున్నారు.
కాగా అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షుడి ఇంటిపై (US Vice President home) కాల్పులు జరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది. భారీ భద్రత ఉండే జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు ఎలా జరిగాయనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. అసలు కాల్పులు జరపడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై, వాన్స్, వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు. అయితే వారం రోజులుగా సెలవులో ఉన్న జేడీవాన్స్ అదే ఇంట్లో ఉన్నారు. కాల్పులు జరగడానికి కొన్ని గంటల ముందు ఆయన వెళ్లిపోయారు. దీంతో పక్కా రెక్కి నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తోంది.