అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓ భూ వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి గాలిలోకి కాల్పులు జరిపాడు.
మణికొండ (Manikonda) పంచవటి కాలనీలో కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా కాల్పులు జరిపింది ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్‌గా గుర్తించారు. స్థలం ఖాళీ చేయాలని బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ (Rayadurgam Police Station)లో ఫిర్యాదు చేశారు.
Hyderabad | అనుచరులతో బెదిరింపులు
మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థలాన్నీ ఖాళీ చేయాలని ప్రభాకర్ బాధితులను బెదిరించాడు. ఆయన అనుచరులు బాధితులను బయటకు గెంటేసీ గేటుకు తాళాలు వేశారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకోగా ప్రభాకర్ గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | వరుస ఘటనలతో ఆందోళన
నగరంలో ఇటీవల కాల్పుల ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 22న మేడ్చల్ జిల్లా పోచారం (Pocharam)లో సోనూ సింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులు జరిపాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్టోబర్ 25న చాదర్‌ఘట్‌లోని విక్టోరీయా గ్రౌండ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులపై సెల్‌ఫోన్ దొంగ కత్తితో దాడి చేయడానికి యత్నించాడు. దీంతో ఏసీపీ దొంగపై ఫైరింగ్ చేశారు. అంతకు ముందు నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్‌ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నల్గొండ జిల్లాలో గన్‌తో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండం ఆందోళనకు గురి చేస్తుంది.
