అక్షరటుడే, వెబ్డెస్క్: Smriti Mandhana | టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన , సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ మధ్య గత ఆరేళ్లుగా ఉన్న ప్రేమ, గతేడాది చివర్లో పెళ్లి వరకు వెళ్లింది. మరి కొద్ది నిమిషాలలో వివాహం జరుగుతుంది అని అందరు అనుకుంటున్న సమయంలో ఆగిపోవడం అప్పట్లోనే పెద్ద చర్చకు దారితీసింది. నవంబర్ 23న పెళ్లి జరగాల్సి ఉండగా, అనూహ్యంగా వేడుకలు రద్దుకావడంతో అభిమానులు, క్రీడా వర్గాలు షాక్కు గురయ్యాయి.
ఈ నేపథ్యంలో స్మృతి చిన్ననాటి స్నేహితుడు విజ్ఞాన్ మానే (Vignan Mane) ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. మానే చేసిన వ్యాఖ్యల ప్రకారం, పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే పలాష్ ముచ్చల్ మరో మహిళతో గదిలో పట్టుబడ్డాడని ఆయన ఆరోపించారు. ఆ ఘటనను చూసిన స్మృతి సహచర మహిళా క్రికెటర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారని, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు.
Smriti Mandhana | ఇది నిజమా?
అయితే ఇవన్నీ తన అభిప్రాయాలు, తనకు తెలిసిన విషయాలేనని మానే పేర్కొన్నాడు. అంతేకాదు, పలాష్ ముచ్చల్ (Palash Muchhal) కుటుంబంపై కూడా విజ్ఞాన్ మానే తీవ్రమైన ఆరోపణలు చేశాడు. పలాష్ తెరకెక్కిస్తున్న ‘నజరియా’ సినిమా (Nazariya Movie) విషయంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి తన నుంచి సుమారు రూ.40 లక్షలు తీసుకున్నారని, ఇప్పుడు సినిమా బడ్జెట్ పెరిగిందని చెబుతూ మరో రూ.10 లక్షలు ఇవ్వకపోతే పాత డబ్బులు కూడా తిరిగి ఇవ్వబోమని తనను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో పలాష్ తల్లి అమితా ముచ్చల్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మానే వాపోయారు. పెళ్లి రద్దైన తర్వాత ఆ కుటుంబం మొత్తం తన ఫోన్ నంబర్లను బ్లాక్ చేసిందని, చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ ఆరోపణలపై పలాష్ ముచ్చల్ సోషల్ మీడియా (Social Media) ద్వారా స్పందించారు. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేసిన ఆయన, విజ్ఞాన్ మానే చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అసత్యమని, తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తన లాయర్ శ్రేయాన్ష్ మిథారే ద్వారా చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. మరోవైపు విజ్ఞాన్ మానే మాత్రం తన దగ్గర కాల్ రికార్డింగ్స్, చాట్ ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే అవన్నీ మీడియాకు, పోలీసులకు సమర్పిస్తానని సవాల్ విసిరారు. ఈ మొత్తం వివాదంపై స్మృతి మంధాన ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఆమె మౌనం పాటిస్తుండగా, స్నేహితుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.