అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ukraine – Russia | ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ద విరమణకు ఓ వైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. తాజాగా కీవ్‌కు మాస్కోభారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ నావికాదళానికి చెందిన నిఘా నౌక సిమ్‌ఫెరోపోల్(Surveillance Ship Simferopol)ను సముగ్ర డ్రోన్‌తో దాడి చేసి ధ్వంసం చేసింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్(Ukraine)కు చెందిన అతిపెద్ద నౌక ఇదే కావడం గమనార్హం. లాగునా తరగతికి చెందిన మధ్యస్థాయి నిఘా నౌకను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ(Russian Defense Ministry) వెల్లడించింది. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ వ్యవస్థలతో నిఘా కోసం ఉద్దేశించిన ఈ నౌకను డానుబ్ నది డెల్టా జలాల్లో తుత్తునియలు చేసినట్టు పేర్కొంది. రష్యా దళాలు(Russian Troops) సముద్ర డ్రోన్‌ను ప్రయోగించి ఉక్రెయిన్ యుద్ధ నౌకను ధ్వంసం చేయడం ఇదే తొలిసారి. 2014 తరువాత ఉక్రెయిన్ నావికా దళంలోకి ప్రవేశించిన అతి పెద్ద యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది.
Ukraine – Russia | ఇదే అతి పెద్ద నౌక
భారీ నౌకపై జరిగిన దాడిని ఉక్రెయిన్ అధికారులు కూడా ధ్రువీకరించారు. నావలోని సిబ్బంది ఒకరు మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఉక్రెయిన్ నేవీ తెలిపింది. దాడి అనంతర పర్యవసానాలపై దృష్టిపెట్టినట్టు వెల్లడించింది. “దాడి తర్వాత పరిస్థితిని పరిష్కరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సిబ్బందిలో ఎక్కువ మంది సురక్షితంగా ఉన్నారు. గల్లంతయిన నావికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని” ఉక్రేనియన్ నేవీ ప్రతినిధి డిమిట్రో ప్లెటెన్‌చుక్ కైవ్ ఇండిపెండెంట్‌తో అన్నారు.
Ukraine – Russia | నౌకపై రష్యా తొలి దాడి
ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నౌకపై రష్యా సముద్ర డ్రోన్(Russian Sea Drone) దాడి చేయడం ఇదే తొలిసారి. రిమోట్‌గా ఆపరేట్ చేయబడిన పడవను ఉపయోగించి రష్యా ఈ దాడిని నిర్వహించింది. ఉక్రెయిన్ గతంలో అనేక రష్యన్ నావికాదళ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. గత మూడేళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధంలో రష్యానౌకలపై దాడి చేసి దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో మాస్కో కూడా తగిన రీతిలో బదులిచ్చేందుకు ఇప్పుడు డ్రోన్ దాడులపై దృష్టి సారిస్తోంది. గురువారం, అది కైవ్‌పై డ్రోన్, క్షిపణి దాడిని ప్రారంభించింది, కనీసం 19 మంది మరణించారు. 48 మంది గాయపడ్డారు. ఈ దాడిలో కనీసం నలుగురు పిల్లలు మరణించారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అదే సమయంలో గురువారం 102 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూడా కూల్చివేసినట్లు రష్యన్ అధికారులు పేర్కొన్నారు.
Ukraine – Russia | పిల్లలను చంపుతున్నారన్న జెలెన్‌స్కీ..
మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. పుతిన్(Putin) తమ పిల్లలను చంపుతున్నాడని విమర్శించారు. గురువారం రోజంతా దాదాపు 600 డ్రోన్లు, 31 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారన్నారు. “రష్యా లక్ష్యాలు మారలేదని ఈ దాడి స్పష్టంగా చూపిస్తుంది. వారు యుద్ధాన్ని కోరుకుంటున్నారు, మా ప్రజలు, నగరాలను మాత్రమే కాకుండా ప్రపంచంలోని శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరి పైనా దాడి చేస్తారు” అని జెలెన్‌స్కీ (Zelensky) పేర్కొన్నారు. తాజా దాడి ఉక్రెయిన్‌పై, యూరప్‌పై, అధ్యక్షుడు ట్రంప్‌పై, ఇతర ప్రపంచ దేశాలపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు.