అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | తెలంగాణ బీజేపీకి సుప్రీంకోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను సీజేఐ గవాయ్(CJI Gavai) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజకీయ నేతలకు సున్నిత మనసు ఉండకూడదని అభిప్రాయపడింది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని సూచించింది. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికింది. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) సుప్రీంకోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ పరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బీజేపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు(Supreme Court) నిర్ణయంతో దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించినట్లంది.
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-125 కింద కేసు కొనసాగుతుందని తెలిపింది.
దీంతో రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తే టీ-బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీజేపీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సోమవారం విచారించిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తోసిపుచ్చింది. రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా కోర్టులను మార్చకూడదని హితవు పలికింది.