అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS family | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు (AP Congress Party President YS Sharmila) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్ సీఎల్‌టీ) షాక్ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఊరట కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్ వేసిన పిటిషన్‌ను అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ.. జగన్ వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు విజయలక్ష్మి నుంచి షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది.
YS family | కూతురికి వాటా రాసిచ్చిన తల్లి..
వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకంలో విభేదాలు తలెత్తడం, రాజకీయ ముసలం చెలరేగడంతో జగన్, షర్మిల మధ్య వివాం నెలకొంది. వైఎస్సార్‌సీపీ కోసం ఎంతో కష్టపడిన తనకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, ఆస్తిలో వాట ఇవ్వకుండా జగన్ మోసం చేశారని షర్మిల ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే, వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో టేకోవర్ చేసుకున్న సరస్వతీ పవర్ అండ్ ఇండస్ర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల విషయమై అన్నా, చెల్లి మధ్య పోరాటం సాగుతోంది. వైఎస్ సతీమణి విజయలక్ష్మి (YS wife Vijayalakshmi) తన పేరిట ఉన్న 51 శాతం షేర్లను కూతురు షర్మిల పేరిట బదిలీ చేశారు. దీంతో కంపెనీలో షర్మిలకు ప్రధాన వాటి దక్కినట్లయింది.
YS family | మోసం చేశారని ఫిర్యాదు
అయితే, షేర్ల బదిలీపై తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల (YS Sharmila) మోసగించారని, షేర్ల బదిలీ నిలిపివేయాలని జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేశారు. తమకు తెలియకుండా షేర్ల బదిలీకి తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారని ఈ బదిలీని రద్దుచేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్, భారతి, వారి కంపెనీ క్లాసిక్ రియాల్టీ విన్నవించింది. ‘మా మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ, అభిమానంతో సరస్వతి పవర్‌లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంవోయూ జరిగింది. అయితే, ఒప్పంద షరతులకు విరుద్ధంగా తల్లి, చెల్లి వ్యవహరించారు.
షేర్ల పత్రాలు, షేర్ల బదిలీ పత్రాలు అన్నీ ఇప్పటికీ నా వద్దే ఉన్నాయి. భౌతికంగా గిఫ్ట్ ఇచ్చేవారి నుంచి తీసుకునే వారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్ డీడ్ పూర్తవుతుంది. అసలు నేను గిఫ్ట్ ఇవ్వలేదు. ప్రస్తుతం గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. నా తల్లి చెల్లి పట్ల పక్షపాతం చూపిస్తోంది. నా తల్లి, చెల్లిపై ప్రేమ, అభిమానాలు పోయాయి. అందుకే షరతులతో కూడిన ఎంవోయూను, గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నా. ఈ పరిస్థితుల్లో నా తల్లి చేసిన షేర్ల బదిలీ చెల్లదని’ అని జగన్ పేర్కొన్నారు.
జగన్ వాదనలతో ఏకీభవించిన ఎన్‌సీఎల్‌టీ షేర్ల బదిలీపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టులో (High Court) సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తన అన్న, వదిన కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని షర్మిలతో పాటు విజయలక్ష్మి కూడా ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.