అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Life Tax Hike | కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం (State Govt) షాక్ ఇచ్చింది. ఆయా వాహనాల ధరలను బట్టి లైఫ్ ట్యాక్స్ (Life Tax) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రవాణా శాఖలో (Transport Dept) భారీగా ఛార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా మరోసారి ప్రజలపై భారం మోపింది. రిజిస్ట్రేషన్, లైసెన్స్, వాహనాల కొనుగోలుపై ఛార్జీలను గత నెలలో పెంచిన విషయం తెలిసిందే.
Life Tax Hike | నేటి నుంచి అమలులోకి..
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం ధరలను పెంచిన సర్కారు.. ఇటీవల రవాణా శాఖలో పలు ఛార్జీలను పెంచింది. తాజాగా వాహనాల జీవిత కాలపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు సగటున మూడు శాతం మేర ట్యాక్స్ పెంచింది. ఈ పెంపు గురువారం (నేటి) నుంచి అమలులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో దాదాపు 70 శాతం లైఫ్‌ట్యాక్స్ ద్వారానే వస్తుంది. తాజాగా దీనిని పెంచడంతో ఏటా ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని సమాచారం.
Life Tax Hike | పెంపు ఇలా..
వాహనాల (Vehicles) లైఫ్ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వం శ్లాబుల సంఖ్య పెంచింది. గతంలో ద్విచక్రవాహనాలు కొనుగోలు చేస్తే.. ఎక్స్ షోరూమ్ ధర రూ.50 వేల లోపు ఉంటే 9శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే 12శాతం లైఫ్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.50 వేల లోపు ధర ఉంటే 9శాతం, రూ.50 వేల– రూ.లక్ష వరకు 12శాతం, రూ.లక్ష –రూ.2 లక్షల వరకు 15శాతం, రూ.2 లక్షలపైన ఉన్న బైక్‌లకు 18 శాతం జీవిత పన్నుగా నిర్ణయించారు.
Life Tax Hike | కార్లు, ఇతర వాహనాలకు..
రాష్ట్రంలో వ్యక్తిగత కార్లు, త్రిచక్ర వాహనాలు, ఇతర వెహికిల్స్‌కు ప్రస్తుతం నాలుగు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రూ.5లక్షల లోపు ధర ఉన్న వాహనాలకు 13శాతం, రూ.5 లక్షల –రూ.10 లక్షలు ఉంటే 14 శాతం, రూ.10 లక్షల – రూ.20 లక్షల ధర ఉంటే 17శాతం, రూ.20 లక్షలపైన రేటు ఉన్న వెహికిల్స్‌కు 18శాతం పన్ను వసూలు చేశారు. ఇప్పుడు ఐదు శ్లాబులకు పెంచారు. ఇప్పుడు శ్లాబులను 5కు పెంచారు. రూ.5లక్షలలోపు వాహనాలకు 13శాతం, రూ. 5 లక్షల –రూ.10 లక్షలకు 14 శాతం, రూ.10 లక్షలు–రూ.20 లక్షల వాహనాలకు 18శాతం, రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల ధర ఉన్న వాహనాలకు 20శాతం, రూ.50 లక్షలకంటే ఖరీదైన వాహనాలకు 21 శాతం జీవితకాల పన్ను విధించనున్నారు.
Life Tax Hike | ప్రజలపై భారం
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలపై భారం పడనుంది. వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్, ఫిట్నెస్టెస్ట్, లైసెన్స్ ఛార్జీలు పెంచిన సర్కారు తాజాగా.. లైఫ్ ట్యాక్స్ మోత మోగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై దీనిప్రభావం తీవ్రంగా పడనుంది. మరోవైపు సెకండ్ హ్యాండ్లో బండ్లు కొనుగోలు చేసినా.. లైఫ్‌ట్యాక్స్ పెంపు వర్తించనుంది.