అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు నాంపల్లి కోర్టు (Nampalli Court) షాక్ ఇచ్చింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై గతంలో పలు ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, నటి సమంత విడాకులు, డ్రగ్స్ కేసులో కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును శనివారం విచారించిన న్యాయస్థానం ఈ నెల 21లోపు మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
కేటీఆర్‌పై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఫిర్యాదుతో పాటు సాక్ష్యాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన కోర్టు మంత్రి సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్లు గుర్తించింది. దీంతో క్రిమినల్ కేసు నమోదు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మంత్రి తరఫు న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది.