అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kannappa Movie | మంచు విష్ణు (Manhu Vishnu) హీరోగా తెరకెక్కిన కన్నప్ప మూవీ (Kannappa Movie) ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంచు విష్ణుకు జీఎస్టీ (GST) అధికారులు షాక్ ఇచ్చారు. విష్ణు ఇళ్లు, ఆఫీస్‌తో పాటు పలువురి ఇళ్లలో బుధవారం సాయంత్రం దాడులు చేశారు.
మంచు విష్ణు హీరోగా ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్‌బాబు (Mohan Babu) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆది నుంచి అనేక వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్నో వివాదాలు దాటి ఈ సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఇళ్లు, కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడం గమనార్హం. మంచు విష్ణుతో పాటు పలువురి ఇళ్లల్లో చేపట్టారు. మాదాపూర్‌లోని మంచు విష్ణు కార్యాలయంలోనూ సోదాలు చేశారు.
Kannappa Movie | భారీ బడ్జెట్ మూవీ
కన్నప్ప మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. చాలా మంది స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. అంతేగాకుండా మంచు విష్ణు, మోహన్‌బాబు ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూవీ బడ్జెట్ చెబితే ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు తన ఇంట్లో తనిఖీలు చేస్తారన్నారు. అయితే తాజాగా జీఎస్టీ అధికారులు ఆయన ఆఫీసులో సోదాలు చేయడం గమనార్హం. మూవీ బడ్జెట్‌పై అధికారులు ఆరా తీశారు. ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో వివరాలు సేకరించారు.