అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి షాక్ తగిలింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా చెప్పుకునే పులివెందులలో (Pulivendula) ఆ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రెండ్రోజుల క్రితం జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ (YSRCP) చివరకు డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది.
తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో ఆమె ఏకంగా 6,050 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.
YS Jagan | కంచుకోటకు బీటలు..
పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పేరొందింది. దశాబ్దాల కాలంగా ఆ కుటుంబానిదే అక్కడ ఆధిపత్యం. ఏ ఎన్నిక అయినా వైఎస్ కుటుంబం (YS Family) పెట్టిన అభ్యర్థి మాత్రమే విజయం సాధిస్తారు. అక్కడ చాలా వరకు ఎన్నికలు ఏకగ్రీవంగానే జరిగేవి. అక్కడి ప్రజలు వైఎస్ కుటుంబం మాట దాటరన్న పేరుంది. అక్కడి ప్రజలతో అంతలా పెనవేసుకుపోయిన ఆ కుటుంబానికి తాజా ఉప ఎన్నిక షాక్ తగిలేలా చేసింది. ఓడిపోవడమే కాదు, డిపాజిట్ కూడా కోల్పోవడం వారిని కలవపాటుకు గురి చేసింది. తాజా ఫలితంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళనలో పడిపోయాయి. అధికారంలో ఉన్న టీడీపీ ఎట్టకేలకు వైఎస్ జగన్ (YS Jagan) కంచుకోటకు బీటలు కొడుతూ పులివెందులలో పసుపు జెండా ఎగురవేసింది. మరోవైపు, ఈ ఎన్నికకు ముందు నుంచే వైఎస్సార్ సీపీ టీడీపీపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, పోలింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ కౌంటింగ్‌ను వైసీపీ నేతలు బహిష్కరించారు.