HomeతెలంగాణGovt Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులకు షాక్​.. ఇక టెట్​ పాస్​ కావాల్సిందే!

Govt Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులకు షాక్​.. ఇక టెట్​ పాస్​ కావాల్సిందే!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు (Supreme Court) షాక్​ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు తప్పనిసరిగా టెట్​ (TET) పాస్​ కావాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరు టెట్​ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సర్వీసులో కొనసాగాలన్నా.. పదోన్నతులు పొందాలన్నా ఇక ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్‌) తప్పనిసరి కానుంది. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది.

తమిళనాడుకు సంబంధించిన కేసును జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా వారు దేశంలో విద్యార్హత గల టీచర్ల అవశ్యకత గురించి తీర్పులో పేర్కొన్నారు. ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న టీచర్లు తప్పనిసరిగా టెట్‌ పాస్‌ కావాలని ఆదేశించింది. ఈ తీర్పు ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై పడనుంది.

Govt Teachers | రాజీనామా చేయాలి

టెట్​ పాస్​ కాలేని వారు, రాయడానికి ఇష్టపడి ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోర్టు సూచించింది. ఐదేళ్లలోపు పదవి విరమణ ఉన్న వారికి మాత్రం టెట్​ నుంచి ధర్మాసనం మినహాయింపు ఇచ్చింది. ప్రమోషన్ల విషయంలో కూడా టెట్​ తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే పదోన్నతులు (Promotions) పొందిన వారు రెండేళ్లలోపు టెట్​ పాస్​ కావాలని సూచించింది. లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని పేర్కొంది. అయితే ఉద్యోగం కోల్పోయిన వారికి రిటైర్మెంట్​ బెన్ఫిట్స్​ అందించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

Govt Teachers | తెలంగాణలో..

తెలంగాణలో 2012 డీఎస్సీ (DSC) నుంచి టెట్‌ పరీక్ష అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా.. వారిలో 30 వేల మంది రెండేళ్లలోపు టెట్‌ పాస్‌ కావాలి. లేదంటే వారు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. దీంతో 2012 తర్వాత అందరు టెట్​ పాస్​ అయి ఉద్యోగం సాధించారు. అంతకు ముందు కొలువు సాధించిన 30 వేల మందిపై తీర్పు ప్రభావం పడనుంది.