అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shilpa Shetty | ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి బాంబే హైకోర్టు (Bombay High Court)లో పెద్ద ఊరట లభించింది. సోషల్ మీడియా వేదికలపై ఆమెకు సంబంధించిన అసభ్యకర మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇలాంటి కంటెంట్ ఆమె వ్యక్తిగత గోప్యతను, గౌరవాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తోందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ అద్వైత్ సేత్నా ఏకసభ్య ధర్మాసనం, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కంటెంట్‌ను పరిశీలించిన అనంతరం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Shilpa Shetty | “చూస్తేనే ఇబ్బందిగా ఉంది” – హైకోర్టు వ్యాఖ్యలు
సోషల్ మీడియా (Social Media)లో ఉన్న ఈ కంటెంట్ అత్యంత అభ్యంతరకరంగా ఉంది. ఏ వ్యక్తినీ వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసేలా చిత్రించడం సమంజసం కాదు. ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉంది” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తన పేరు, గొంతు, ప్రతిరూపం , సంతకం వంటి వ్యక్తిగత గుర్తింపులను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ నవంబర్ 25న శిల్పా శెట్టి హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న 28 సంస్థలను ఆమె తన పిటిషన్లో నిందితులుగా పేర్కొన్నారు.
శిల్పా శెట్టి తరఫున న్యాయవాది సనా రైస్ ఖాన్ వాదనలు వినిపిస్తూ, “వివిధ ఈ-కామర్స్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు శిల్పా శెట్టి సినిమాల్లోని క్లిప్పింగులు, పబ్లిక్ అప్పియరెన్స్లను ఆమె అనుమతి లేకుండా ఎండార్స్మెంట్ల కోసం ఉపయోగిస్తున్నాయి. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్యారికేచర్లు, అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలు (Deep Fake Videos) సృష్టించి ఆమె గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు” అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.శిల్పా శెట్టికి ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారని, అటువంటి సెలబ్రిటీని అనుమతి లేకుండా అసభ్యంగా చిత్రించడం ఆమె కెరీర్‌పై, వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇంటర్నెట్లో ఉన్న అభ్యంతరకర లింకులు, పోస్టులను వెంటనే బ్లాక్ చేయాలని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT)కు ఆదేశాలు జారీ చేసింది. కేవలం కొన్ని లింకులను తొలగించడం సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.